CM Chandrababu: కోనసీమ గ్యాస్ లీకేజ్‌పై సీఎం ఆదేశాలివే..
ABN , Publish Date - Jan 06 , 2026 | 03:02 PM
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచనలు చేశారు.
అమరావతి, జనవరి 6: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (మంగళవారం) సమీక్ష నిర్వహించారు. బ్లో అవుట్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను సీఎస్ విజయానంద్, హోంమంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులు, సీఎంవో సహా ఇతర అధికారులు వివరించారు. ప్రమాద స్థలంలో ప్రస్తుత పరిస్థితి, ప్రజల రక్షణకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి తెలియజేశారు.
పునరావాస కేంద్రాల్లో ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపైనా అధికారులతో సీఎం మాట్లాడారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతారని... వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని సూచించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇళ్లు, ఊళ్లు వదలిన వారు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని చెప్పారు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి, ఇతరత్రా నష్టం జరిగిన వారికి నష్టపరహారం అందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించాలని సూచనలు చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి తరహా ఘటనలు తలెత్తకుండా ఓఎన్‌జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశ నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
ఎమ్మెల్సీ ఫ్లెక్సీల తొలగింపు.. ఉద్రిక్తం
‘మీ పని అద్భుతం’.. మంత్రులు, అధికారులకు సీఎం కితాబు
Read Latest AP News And Telugu News