జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు.. మంత్రుల ప్రకటన
ABN , Publish Date - May 18 , 2026 | 03:08 PM
జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు విడుదల చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ప్రకటించారు. కాలువల్లో పూడిక తొలగింపు పనులను మే చివరికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, మే 18: ఖరీఫ్-2026 సాగునీటి విడుదలపై మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సచివాలయంలో ఈరోజు(సోమవారం) సమీక్ష నిర్వహించారు. జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు విడుదల చేస్తామని మంత్రులు ప్రకటించారు. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాలువల్లో పూడిక తొలగింపు పనులను మే చివరికి పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. గత సీజన్‌లో 2025-26 ఖరీఫ్‌లో 99.35 లక్షల ఎకరాలకు 888 టీఎంసీల నీటి సరఫరా చేశామని, రబీ సీజన్‌లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించామని మంత్రులు తెలిపారు. రాష్ట్ర రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వెల్లడించారు.
డెల్టా ప్రాంతాలకు నీటి విడుదల షెడ్యూల్
గోదావరి డెల్టాకు జూన్ 1 నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు. కృష్ణా డెల్టాకు జూలై 1 నుంచి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జూలై చివరికి, కె.సి. కెనాల్‌కు జూలై 15 నుంచి, వంశధార ఆయకట్టుకు జూన్ 15 నుంచి సాగునీరు విడుదల చేస్తామని తెలిపారు.
అధికారులకు హెచ్చరికలు..
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఖరీఫ్-2026 ప్రణాళికలు, ఎల్ నినో ప్రభావంపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. యూరియా సరఫరా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు అందజేస్తామని, అవసరం మేరకు ఆ కార్డు ద్వారా యూరియా తీసుకోవచ్చని తెలిపారు. ముందస్తు నిల్వలు వద్దని, రెండు-మూడు దశల్లో నానో యూరియా వినియోగించాలని సూచించారు. యుద్ధం కారణంగా యూరియా దిగుమతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందువల్ల యూరియాను అవసరం మేరకు మాత్రమే వాడాలని రైతులకు అచ్చెన్నాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి...
జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన
జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతాం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telugu News