Share News

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

ABN , Publish Date - May 18 , 2026 | 01:13 PM

హైదరాబాద్‌‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్(25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
Supreme Court

న్యూఢిల్లీ, మే 18: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్(25-35 మీటర్ల పరిధి) లోపల ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్‌ చుట్టూ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టగా.. చెట్ల నరికివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్క్ హైదరాబాద్‌కు ప్రధాన ‘గ్రీన్ లంగ్స్’ అని.. ఎకో సెన్సిటివ్ జోన్‌కు రక్షణ కోరుతూ పిటిషన్ వేశారు.


2020 అక్టోబర్ 27న ఎకో సెన్సిటివ్ జోన్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యిందని.. పబ్లిక్ హియరింగ్ లేదని పిటిషనర్ ఆరోపించారు. ఎస్‌ఆర్‌డీపీ రోడ్డు ప్రాజెక్టుల కోసం ఎకో జోన్ కుదించారని అన్నారు. తెలంగాణ హైకోర్టు మార్చి 31న స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుల పిటిషన్ వేశారు. 19,000 మంది సంతకాలతో వ్యతిరేక పిటిషన్ వచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ ఆరోపించారు. పబ్లిక్ హియరింగ్ జరిగినట్టు రాష్ట్రం తప్పుడు సమాచారం ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.


ఈరోజు(సోమవారం) జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పర్యావరణ ప్రేమికుల తరఫున సీనియర్ కౌన్సిల్ కె.వివేక్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. దీంతో చెట్ల నరికివేతపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎకో సెన్సిటివ్ జోన్‌ను ‘షాక్ అబ్జార్బర్’గా ఉంచాలని పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 27కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు స్టే ఆదేశాలతో ఎస్‌ఆర్‌డీపీ(SRDP- Strategic Road Development Project) పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ప్రధానంగా కేబీఆర్ జంక్షన్ పరిసరాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణాలకు భారీ ఆటంకం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి...

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2026 | 02:24 PM