అన్నీ తెలిసే నా గొంతు కోశారు.. జోగి రమేశ్ కోడలి కన్నీటి పర్యంతం
ABN , Publish Date - Aug 25 , 2026 | 02:29 PM
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. జోగి కుటుంబంపై కోడలు మేఘన సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ తెలిసే తన గొంతు కోశారంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
విజయవాడ, ఆగస్టు 25: మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. జోగి కుటుంబంపై కోడలు మేఘన సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ తెలిసే తన గొంతు కోశారంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అండగా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలిపేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని.. ఆడపిల్లగా ఇలా మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉందని ఆవేదన చెందారు.
అందుకే మీడియా ముందుకు వచ్చా...
‘నాకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని గట్టిగా నిలబడ్డాను. ఈరోజు ఈ పరిస్థితులను దైర్యంగా ఎదుర్కొన్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. జోగి రమేశ్, వారి కుటుంబ సభ్యులు నాపై నిందలు వేస్తున్నారు. 2025 మేలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌తో నాకు పెళ్లి చేశారు. మా నాన్న నా సంతోషం కోసం ఎంతో కష్టపడి ఈ పెళ్లి జరిపారు. జోగి రమేశ్ మీద నమ్మకంతో వారింటికి కోడలుగా పంపారు. అందరి ఆడపిల్లలాగా ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగు పెట్టాను. కొన్ని రోజులకే నన్ను ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం అనేది సహజం. కానీ రాజీవ్‌కు ఉన్న ప్రాబ్లమ్ ఆ కుటుంబసభ్యులు అందరికీ తెలుసు. అయినా నాకు అతనితో పెళ్లి చేసి, తెలిసి తెలిసి అమ్మాయి గొంతు కోయడం అనేది పెద్ద నేరం. జోగి రమేశ్‌కు కూడా ఒక కూతురు ఉంది.. ఆమెకు ఇలా జరిగితే ఏం చేస్తారు. అసలు లోపం ఉందని తెలిసి నాతో ఎలా పెళ్లి చేశారో జోగి రమేశ్ చెప్పాలి. మా ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్లే విడిపోయారని నిన్న(సోమవారం) జోగి రమేశ్ చెబుతున్నారు. అసలు మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ వచ్చిందో ఆయన చెప్పాలి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జోగి రమేశ్ నిన్న మీడియాతో మాట్లాడారు. వాస్తవాలు తెలియజేయాలనే నేడు నేను మీడియా ముందుకు వచ్చాను’ అని చెప్పుకొచ్చారు.
మా అత్తయ్య హింసించింది...
‘జోగి రమేశ్ నిన్న సింపతీ కోసం, రాజకీయం కోసం మాట్లాడినట్లుగా ఉంది. అసలు వాస్తవాలు ఏమిటో నేను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించాను. త్వరలోనే అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. మా వివాహం జరిగిన తర్వాత ఉన్న ఇబ్బందులను మా మావయ్య, అత్తయ్యకే వివరించాను. సమస్యలను పరిష్కరించకుండా.. అదనపు కట్నం తేవాలంటూ మా అత్తయ్య నన్ను హింసించింది. మాకు పొలిటకల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.. మేము చెప్పిందే చేయాలని బెదిరించారు. అదనపుకట్నం తీసుకువస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు.. అప్పడే అతనికి ఫీలింగ్స్ వస్తాయని అత్త మాట్లాడింది. తల్లి స్థానంలో ఉన్న శకుంతల... అర్థం చేసుకోకుండా నన్నే తప్పు బట్టారు. మా పెళ్లికి ముందు హిందువులమని చెప్పి మాకు పెళ్లి చేశారు. కానీ వారి కుటుంబం మొత్తం క్రిస్టియన్స్.. ఇంట్లో హిందూ పూజలు అస్సలు చేయరు. నాకు చిన్న నాటి నుంచి హిందూ పూజలు చేయడం అలవాటు. నేను వారింటికి వెళ్లిన తర్వాత ఒక్క హిందూ దేవుళ్ల ఫొటో అక్కడ లేదు. నేను దేవుళ్ల ఫొటో తెచ్చి పూజ చేస్తుంటే.. అడ్డుకుని కొట్టారు. ఎవరి నమ్మకం వాళ్లది.. కానీ మాకు క్రిస్టియన్ మతం తీసుకున్నట్లు కూడా చెప్పలేదు. హిందువులమే అని చెప్పి... మాకు ఆ ప్రకారం పెళ్లి చేశారు.. అంటే ఇది కూడా మోసం చేయడం కాదా. మేము రాజకీయం చేస్తున్నాం.. ఎవరితోనో కలిసి నడిపిస్తున్నామని చెబుతున్నారు. కానీ మా వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి.. వాటిని కూడా త్వరలోనే బయట పెడతా’ అని తెలిపారు.
అవి గోరుముద్దులు కాదు.. విషపు ముద్దలు
‘అత్తగా ఉన్న శకుంతల అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టారు. కొడుకు లోపం గురించి మాత్రం మాట్లాడకుండా నిందలు నా పై మోపుతున్నారు. నేను పూజలు చేసుకునే సమయంలో అడ్డుకుని.. చేతిలో ఉన్న హారతి, అగర్ బత్తీలు లాగి పడేశారు. మీ దేవుళ్లు కూడా ఒక దేవుళ్లేనా... ఇవన్నీ కుదరదు అని ఫొటోలు బయట పడేసి నన్ను కొట్టారు. మీ దేవుడిని నమ్ముకోవడం వల్లే నీకు ఇలా జరిగింది.. మా దేవుడిని నమ్ముకో నీకు మంచి జరుగుతుందని చెప్పేవారు. ఎవరి దేవుడు వారికి గొప్ప.. కానీ అన్నీ దాచి, మోసం చేసి మా పెళ్లి చేశారు. ఏ ఆడపిల్ల ఇలా మీడియా ముందుకు వచ్చి అల్లరి అవ్వాలని కోరుకోదు. మతం గురించి చెప్పలేదు, కొడుకు లోపం గురించి చెప్పలేదు, వారికి ముందే తెలిసినా.. సంబంధంలేని నా గొంతు కోశారు. నీ అత్తగారు తల్లిలాగా, నేను నిన్ను కూతురిలాగా చూసుకున్నా అని జోగి రమేశ్ చెబుతున్నారు. అదే జరిగితే.. నేను ఈరోజు ఇలా ఎందుకు రోడ్డు మీదకు వస్తాను. ఆమె గోరుముద్దులు తినిపించలేదు.. విషపు ముద్దలు తినిపించింది కాబట్టే నా జీవితం ఇలా బలైపోయింది. వాళ్ల పిల్లల గురించి తల్లిదండ్రులుగా జోగి రమేశ్, శకుంతలకు అన్నీ తెలుసు. ఆ కుటుంబం వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పటికీ తప్పు అంగీకరించకుండా.. నాపై కక్ష సాధించాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను కలిసి వచ్చిన వీడియోను దొంగచాటుగా తీశారు. నేను జోగి రమేశ్ కుటుంబం వల్ల బాధితురాలిగా ఉన్నాను.. న్యాయం కోసం నేనే వెళ్లాను. ఆయన రాజకీయంగా కాకుండా.. ఆడపిల్ల జీవితం కాబట్టి.. రచ్చ చేసుకోవద్దనే చెప్పారు. జోగి రమేశ్ సొంత బాబాయితో కూడా ఎమ్మెల్యే మాట్లాడి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. రమేశ్ బాబాయి కూడా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది’ అంటూ చెబుతూ మేఘన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో కలలుగన్న జీవితాన్ని నాశనం చేశారు..
‘జోగి రమేష్ కుటుంబం గురించి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిసి వివరించాను. న్యాయం చేస్తామని ఆయన చెప్పినా... ఆ తర్వాత పట్టించుకోలేదు. మాజీ సీఎం జగన్ ఆఫీస్‌కు కూడా వెళ్లాం.. కానీ అక్కడ కలవడం కుదరలేదు. మా మధ్య గొడవలు వస్తే... పరిష్కరించుకోవాలే గానీ రెండు నెలలకే డైవర్స్ ఫైల్ చేశారు. జోగి రాజీవ్ డైవర్స్ ఫైల్ చేసిన విషయం జోగి రమేశ్ తెలియకుండా చేస్తారా. వారు చేసిన ఎలిగేషన్స్‌ను తప్పుబడుతూ కోర్టు ఆ పిటీషన్‌ను డిస్మిస్ చేసింది. అప్పటి నుంచి మా కుటుంబం మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏడాది కాలంగా అసలు విషయాలు దాచి పెట్టి... మాపైనే నిందలు వేస్తున్నారు. మా తల్లిదండ్రులు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే.. వారిని కూడా దూషించారు. గొడవలు పెరిగిపోతున్న సమయంలో మానసికంగా బాగా ఇబ్బందులు పడ్డాను. అక్కడ ఉండలేక నేను కొంతకాలం మా పుట్టింటికి వెళ్లాను. అదే సమయంలో రాజీవ్‌తో పాటు, జోగి రమేశ్‌లు లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లారు. నన్ను ట్రీట్మెంట్ పేరుతో మా పుట్టింటికి పంపిన తర్వాత జోగి రమేశ్ కుటుంబ సభ్యులు ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఎన్నో కలలుగన్న జీవితాన్ని.. తెలిసి కూడా నాశనం చేశారని నిద్ర లేని రాత్రులు గడిపాను. రాజీవ్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా.. అతనితో ఉండాలనే చాలా తట్టుకున్నాను. అసలు వాళ్లు పెట్టిన టార్చర్‌కు నేను, నా కుటుంబం ఎంతో మానసిక క్షోభకు గురయ్యాం. నిన్న ప్రెస్ మీట్‌లో ఆయనే ఏదో ఇబ్బందులు పడ్డారు, క్షోభకు గురైనట్లు జోగి రమేశ్ మాట్లాడారు. మాకు కేసులు, కోర్టులు కొత్తేమీ కాదు... మాకు పోయిందేమీ లేదు అని మా వాళ్లను బెదిరించారు. మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేస్తాం.. కట్నం వస్తుందని హీనంగా మాట్లాడారు. ఆడపిల్ల తల్లిదండ్రులుగా కాపురం నిలుపుదామనే ప్రయత్నించినా.. వారే మమ్మలను ఇబ్బందులు పెట్టారు.
నా జీవితం నాకివ్వండి..
మా పెళ్లినే మోసంతో చేశారు.. తప్పుకు పశ్చాత్తాపం చెందకుండా ఇంకా మోసం మీద మోసం చేస్తూనే ఉన్నారు. మా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ నా రక్షణ కోసం దాచి ఉంచుకున్నాను. కానీ వాటిని కూడా ఏఐ వీడియోలు అంటూ అబద్దాలుగా చిత్రీకరిస్తున్నారు. నేను ఇప్పటి వరకు 20శాతం వీడియోలు మాత్రమే పెట్టాను.. ఇంకా 80శాతం వీడియోలు, ఇతర ఆధారాలు ఉన్నాయి. వాటిని బయట పెట్టిన తర్వాత అవి ఏఐ వీడియోలా, లేదా ఒరిజినల్ వీడియోలా అనేది ఫోరెన్సిక్‌తో అయినా పరిశీలించుకోవచ్చు. మేము న్యాయపరంగా ముందుకు వెళుతున్నాం.. మా గొంతు కోసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా జోగి రమేశ్, శకుంతల నాకు చేసిన అన్యాయం ఏమిటో తెలుసుకుని పశ్చాత్తాపం పొందాలి. ఈ వివాదాలకు దూరంగా ఉండి.. నేను ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. జోగి రమేశ్ అర్థం చేసుకుని ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి, నా జీవితాన్ని స్వేచ్చగా ఉండేలా సహకరించాలి. ఈ కేసుల నుంచి విముక్తి కలిగించి.. నా జీవితం నాకు ఇవ్వాలి. నాకు విడాకులు ఇప్పించి... నాకు కొత్త జీవితం ఇచ్చేలా సహకరించాలి’ అని మేఘన కోరారు.
ఇవి కూడా చదవండి...
క్రిమినల్ రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ-యూకే కీలక ఒప్పందం.. అమరావతి వేదికగా ఎంఓయూపై సంతకాలు
Read Latest AP News And Telugu News