వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదల
ABN , Publish Date - Jan 23 , 2026 | 07:13 PM
ఏపీలో నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు.
విజయవాడ: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు. 83 రోజుల పాటు తనను జైల్లో ఉంచి, ఇష్టం వచ్చినట్లుగా వివిధ జైళ్లకు తిప్పారని వాపోయారు.
ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు జోగి రమేష్ తెలిపారు. అంతకుముందే పలు మీడియా సమావేశాల్లో సీబీఐ విచారణకు సిద్ధమని స్పష్టం చేశానని చెప్పారు. అవసరమైతే నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తానని, చర్చకు సిద్ధమని సీఎం చంద్రబాబుని కూడా కోరానని అన్నారు. అయినప్పటికీ కుట్రతో తనను అరెస్టు చేశారని ఆరోపించారు.
తనను, తన సోదరుడిని 83 రోజుల పాటు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు పెడితే వైసీపీ నేతలు భయపడతారని అనుకుంటే అది పొరపాటేనని స్పష్టం చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామని అన్నారు. రేపు అమ్మవారి ఆలయానికి వెళ్లి తాను తప్పు చేయలేదని ప్రమాణం చేస్తానని జోగి రమేష్ తెలిపారు.
ALso Read:
సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు
Read Latest AP News And Telugu News