ఏపీకి చేరుకున్న కేంద్ర బృందం.. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై అంచనా
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:49 AM
ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర బృందం ఏపీకి చేరుకుంది. ఈరోజు ఉదయం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
అమరావతి, అక్టోబర్ 31: ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది. ఈరోజు(శనివారం) ఉదయం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం నేటి నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో వ్యవసాయ, ఆర్థిక, విద్యుత్, జలవనరులు, ఇస్రో, గ్రామీణాభివృద్ధి, రోడ్లు-రవాణా శాఖల అధికారులు ఉన్నారు.
రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ నష్టంపై సెంట్రల్ టీమ్ అంచనా వేయనుంది. సచివాలయం మొదటి భవనంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్, సీఈవో ప్రఖర్ జైన్ నష్టాన్ని వివరించారు. ఆర్టీజీఎస్ నుంచి విపత్తుల నిర్వహణ విధానంపై కేంద్ర బృందం ఆసక్తి చూపింది. మనమిత్ర గురించి కేంద్ర అధికారులు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ సమయంలో మనమిత్ర ద్వారా ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి రియల్ టైమ్‌లో పరిష్కరించడాన్ని కేంద్ర బృందం అభినందించింది.
గుడ్ ఇన్షియేటివ్ అని.. ఇతర రాష్ట్రాలూ ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని సూచిస్తామని కేంద్ర బృందం పేర్కొంది. అనునిత్యం ప్రజలకు హెచ్చరికలు పంపుతూ తుఫాన్ సమయంలో ఎవ్వరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా, తద్వారా ప్రాణనష్టం పెద్దగా లేకుండా చేశామని.. కేంద్ర బృందానికి ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్నబ్ వల్ల రాష్ట్రానికి రూ.4764 కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. దాదాపు 12 జిల్లాల్లో నష్టం వాటిల్లిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆర్టీజీఎస్ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం అధికారులు... కేంద్రం నుంచి సాయం అందేలా చూస్తామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
మరికొద్ది రోజుల్లో గగన్‌యాన్ D1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి
కదిరి మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు.. ఐదుగురి అరెస్ట్
Read Latest AP News And Telugu News