CM Chandrababu: కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్‌పై సీఎం ఆరా
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:54 PM
ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి గ్యాస్ లేకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై మంత్రులు, అధికారులతో సీఎం మాట్లాడారు.
అమరావతి, జనవరి 5: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆరా తీశారు. ఈ విషయంపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. తాము ఇప్పటికే లీకేజీ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడామని.. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని సూచించినట్లు సీఎంకు మంత్రులు వివరించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని... సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
మంటలను వెంటనే అదుపులోకి తెచ్చేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు సీఎం సూచించారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
గ్యాస్ లీక్.. భారీ మంటలు..
కాగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ అవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేశ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితిపై అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. భద్రతా చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అలాగే సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు
ఊహించని విధంగా ధాన్యం కొనుగోళ్లు... ఇది ఓ చరిత్ర: మంత్రి నాదెండ్ల
Read Latest AP News And Telugu News