సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:35 AM
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ ప్రగతి, పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామని సీఎం తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 9: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో సీఎం ప్రసంగిస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలని, క్షేత్రస్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయి పనులు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.
వాటికే తొలి ప్రాధాన్యం...
గత 19 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలని చంద్రబాబు సూచించారు. క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేశామని, త్వరలో ఉపకరణాలను తయారు చేసి ఎగుమతులు చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ ప్రగతి, పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామన్నారు. ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏ మేరకు చేరుకున్నామన్న అంశంపై స్పష్టత ఉంటుందని వివరించారు. గడచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం, అంధకారం నుంచి బయటపడేశామని తెలిపారు. వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
రైతులను ఆదుకుంటున్నాం...
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో వేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. స్త్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ద్వారా మొబిలిటి పెరిగిందని, ఇప్పటి వరకు 4.29 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు. ప్రస్తుత బస్సులతోనే ఆక్యుపెన్సీ పెరిగిందని వివరించారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.6,310 కోట్ల ఆర్థిక సహకారం అందించామన్నారు. రాయలసీమలో హార్టికల్చర్ హబ్, కోస్తాలో ఆక్వాకల్చర్ పెంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు అవసరమే..
దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లు ఇచ్చామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్థిక చేయూత అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాలు అవసరమా అనే చర్చ సరికాదని.. పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమేనని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాల్లో గ్రోత్ రీజనబుల్‌గా పెరిగిందన్నారు. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పెరిగితే జీవనం మెరుగవుతుందని చెప్పారు. గేట్స్ ఫౌండేషన్, టాటాలు కలిసి సంజీవని ప్రాజెక్టు తీసుకువస్తున్నామని, దేశంలోనే అత్యధిక ఉద్యానవన పంటలు పండిస్తున్నామని వెల్లడించారు.
విశాఖ ఉక్కే నిదర్శనం...
పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టామన్నారు సీఎం. అయిదేళ్లలో డయాఫ్రం వాల్ పూర్తిగా పోయిందన్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ను వెయ్యి కోట్లతో ఈనెల, వచ్చే నెలలోగా పూర్తి చేస్తామన్నారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతి విషయంలో అనేక ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, మూడేళ్లలో అమరావతిని ఒక షేప్‌కు తీసుకొస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మొదటిసారి రూ.54 కోట్ల క్యాష్ ప్రాఫిట్ వచ్చిందని తెలిపారు. కష్టపడితే నష్టాల నుంచి లాభాల బాట పట్టవచ్చనడానికి విశాఖ ఉక్కే నిదర్శనమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘ఉపాధి’ పనుల స్పీడ్‌కు బ్రేకులు
సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య
Read Latest AP News And Telugu News