‘ఉపాధి’ పనుల స్పీడ్‌కు బ్రేకులు
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:34 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సిమెంట్‌రోడ్లు తదితర మెటీరియల్ పనులు చేపట్టిన వారికి బిల్లులు అప్‌లోడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఐసీ పోర్టల్ బ్రేకులు వేస్తోంది. ఈ
బిల్లుల అప్‌లోడ్‌కు కేంద్ర పోర్టల్‌లో అడ్డంకులు
మినీ గోకులాలను అనుమతించని ఎన్‌ఐసీ పోర్టల్
ఒక్కో పంచాయతీలో 20 ఆన్‌గోయింగ్ పనులకే అనుమతి
మార్చిలోపు పనుల పూర్తికి కసరత్తు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సిమెంట్‌రోడ్లు తదితర మెటీరియల్ పనులు చేపట్టిన వారికి బిల్లులు అప్‌లోడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఐసీ పోర్టల్ బ్రేకులు వేస్తోంది. ఈ పథకం మార్చి నెలాఖరుకు పూర్తవుతుండటంతో మంజూరైన పనులన్నీ ఆ లోపు చేయాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉపాధి మెటీరియల్ నిధులతో రాష్ట్రంలో చేపట్టిన సిమెంట్‌రోడ్లు, తారురోడ్లు, మినీగోకులాలు పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు డ్రైవ్ చేపట్టారు. కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులందరూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పనులను వేగవంతం చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించిన లావాదేవీలన్నీ ఎన్‌ఐసీ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. ఈ పోర్టల్‌లో ఎలాంటి సాఫ్ట్‌వేర్ సమస్యలొచ్చినా పనులకు బ్రేకులకు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆఖరులో పనుల వేగం తగ్గించేందుకు సాఫ్ట్‌వేర్‌లో పలు రకాలు అడ్డంకులు సృష్టిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీలో నడుస్తున్న(ఆన్‌గోయింగ్) పనుల సంఖ్య 20కి మించి ఉండరాదని నిబంధనలు పెట్టింది. దీంతో మెజారిటీ పంచాయతీల్లో కొత్త పనులను ఆన్‌గోయింగ్ వర్క్స్ కిందకు చేర్చుకోలేని పరిసితి ఏర్పడింది. జిల్లాల్లో కలెక్టర్లు మంజూరుచేసిన పనులు సర్పంచులు, వెండర్లు త్వరితగతిన పూర్తి చేసినప్పటికీ వెంటనే బిల్లులు అప్‌లోడ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెల్లింపులు పొందడంలో వెనకబడతామన్న ఆందోళన పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 34వేల మినీ గోకులాలు మంజూరుచేసి 20 వేలకు పైగా పనులు కూడా ప్రారంభించారు. అయితే, వాటి బిల్లులు అప్‌లోడ్ చేయడంలో సిబ్బందికి పోర్టల్ సహకరించడం లేదు.
పలు రకాల ఆటంకాలు...
ఎన్‌ఐసీ పోర్టల్‌లో పలు రకాల ఆటంకాలు ఏర్పడ్డాయి. పథకం ముగింపు సమయంలో రాష్ట్రాల్లో అడ్డగోలుగా బిల్లులు అప్‌లోడ్ చేస్తారేమోనన్న యోచనతో కేంద్రం వెబ్‌సైట్ ద్వారా నియంత్రణ ప్రక్రియ చేపట్టింది. దీంతో గ్రామ పంచాయతీల్లో ఉన్న ఆన్‌గోయింగ్ పనుల సంఖ్యను పోర్టల్ 20కి నియంత్రించింది. అంటే ఆన్‌గోయింగ్ కింద 20 లేదా అంతకంటే తక్కువ సంఖ్యలో మాత్రమే పనులు ఉండాలి. అంతకంటే ఎక్కువ పనులను అనుమతించదు. కొత్త పనులు ఇందులో చేర్చాలంటే ఉన్న పనులను తొలగించాల్సి వస్తోంది. కొన్ని పెద్ద పంచాయతీల్లో అధిక సంఖ్యలో పనులు ప్రారంభమైనందున కొత్త పనులు ఆన్‌గోయింగ్ కిందకు తెచ్చే పరిస్థితి లేదు. పోనీ ఈ పనుల జాబితాను తొలగించాలంటే వాటిలో కనీసం 30 శాతం పూర్తి చేసి ఉండాలి. లేకుంటే పోర్టల్ నుంచి తొలగించేందుకు అనుమతించడం లేదు. గ్రామాల్లో సిమెంట్‌రోడ్లు, మినీగోకులాల పనులు పల్లెపండుగ-2 కింద ప్రారంభమయ్యాయి. ఎక్కువ సంఖ్యలో మినీగోకులాలు ఉండటంతో ఈ పనులన్నీ ఆన్‌గోయింగ్ కిందకు పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కేంద్రంతో అధికారుల సంప్రదింపులు..
ఈ సమస్యలపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సంప్రదిస్తూనే ఉన్నారు. 20 పనుల జాబితాలో రైతుల, ఉద్యానవన పంటల, హౌసింగ్‌కు సంబంధించిన పనులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ తరహా పనులు ఎన్ని ఉన్నా... 20 పనుల లిమిట్ అనే అంశం కిందకు రాదు. అయితే మినీ గోకులాలను మాత్రం ఆ తరహా జాబితాలో చేర్చకపోవడంతో రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది. పనులు పూర్తిచేసి బిల్లులు చేసుకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మినీ గోకులాలను పోర్టల్‌లో అనుమతించకపోవడంతో తాము నష్టపోతామన్న ఆందోళన రైతుల్లో ఏర్పడింది. ఉన్నతాధికారులు సత్వరమే కేంద్ర అధికారులతో మాట్లాడి బిల్లులు అప్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.