పోలవరం ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:33 PM
పోలవరం నిర్వాసితులకు పారదర్శకంగా చెల్లింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
అమరావతి, మార్చి 18: పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఈరోజు(బుధవారం) సమావేశం నిర్వహించారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును సీఎం అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి అని, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనాలు చేకూరతాయని తెలిపారు. గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోకుండా, వరదల్లో ప్రజలు మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం విమర్శించారు.
రూ.226.6 కోట్లు జమ
ప్రాజెక్ట్ కోసం తమ ఇళ్లు, భూములను త్యాగం చేశారని సీఎం తెలిపారు. గతంలో సంక్రాంతి సందర్భంగా మొదటి విడతగా రూ.800 కోట్లు, దీపావళి సమయంలో రెండో విడతగా రూ.916 కోట్లు చెల్లించినట్లు గుర్తుచేశారు. 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు మొత్తం రూ.1,943.53 కోట్లు చెల్లించామని వివరించారు. ప్రాజెక్ట్ రెండు దశలుగా నిర్మాణం జరుగుతోందన్నారు సీఎం. తొలి దశలో 38,068 మంది నిర్వాసితులు ఉన్నారని తెలిపారు. ప్రతి నిర్వాసితుడికి ఇంటి నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు ఇస్తున్నామని, ఇంటి స్థలం కోసం రూ.2 లక్షలకు పెంచినట్లు వివరించారు. కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనులు చేపడుతోందని తెలిపారు.
మరో రూ.5 వేల కోట్లు అవసరం..
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రూ.440 కోట్ల వ్యయంతో కట్టిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని.. ఇప్పుడు మళ్లీ వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టామన్నారు. 6 -7 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ ఆలస్యమైపోయిందని.. ప్రాజెక్ట్ ఏమైనా పర్వాలేదనే అహంకార ధోరణితో గత పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. వారం రోజుల్లో డయాఫ్రం వాల్ పూర్తవుతుందని, ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మూడోసారి గోదావరి పుష్కరాల నిర్వహణకు ముందే ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు మరో రూ.5 వేల కోట్లు అవసరమని, ఒక వంతెన కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
పారదర్శకంగా చెల్లింపులు...
నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్ట్ అని సీఎం పేర్కొన్నారు. నిర్వాసితులకు పారదర్శకంగా చెల్లింపులు జరుపుతున్నామని చెప్పారు. దళారులను నమ్మవద్దని సూచించారు. ప్రాజెక్ట్ ప్రారంభానికంటే ముందే నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పోలవరం నిర్వాసితుల పట్ల కూటమి ప్రభుత్వానికి కమిట్‌మెంట్ ఉందని.. నిర్వాసిత యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కూడా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ప్రతి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పీవీఎన్ మాధవ్ ఆదేశం
Read Latest AP News And Telugu News