Share News

CM Chandrababu: గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:12 PM

రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ పండుగ వాతావరణం కనిపిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో ఉత్సవాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

CM Chandrababu: గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Chandrababu

అమరావతి, జనవరి 15: గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సీఎం ఈరోజు (గురువారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గ్రామానికి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి. మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికి ఉండదు’ అని అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పశు సంపదను పూజించే పండుగ సంక్రాంతి అని వివరించారు.


ప్రతి జిల్లాలో ఉత్సవాలు..

రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోందని, ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు పండుగ వాతావరణం కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో ఉత్సవాలు జరుగుతున్నాయని, కేరళలో పడవ పోటీలను తలపించేలా ఆత్రేయపురంలో పడవల పోటీలు, జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం అద్భుతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. జగ్గన్నతోట ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా చేపడతున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. కడప జిల్లా గండికోటలో ఉత్సవాలు, సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నాయని తెలిపారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.


గ్రామాల అభివృద్ధిపై సీఎం మాట్లాడుతూ.. పల్లెల్లోకి వెళ్లినవారికి గుంతలు పడ్డ రోడ్లు కనిపించడం లేదని, ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ పాలసీతో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 2025లో ప్రజల అవసరాలు తీర్చామని, 2026లో ఆకాంక్షలు నెరవేర్చాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా, అన్న క్యాంటీన్ వంటి పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.


వేగంగా అమరావతి, పోలవరం పనులు...

ధాన్యం సేకరణలో 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఈ ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రూ.10వేల కోట్లు చెల్లించామని సీఎం చంద్రబాబు వివరించారు. అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, ట్రూడౌన్ విధానంతో 13 పైసలు తగ్గించామని తెలిపారు. ఏడాదిలో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సీఐఐ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. అమరావతి, పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.


ప్రజల్లోకి తీసుకెళ్లండి...

ఉద్యోగులకు రూ.1,100 కోట్లతో డీఏ ఎరియర్స్, సరెండర్ లీవ్ చెల్లించామని, సీపీఎస్ ఉద్యోగులకు 60 నెలల డీఏ ఎరియర్స్ చెల్లించామని, 2019కి ముందు నీరు చెట్టు బిల్లులు క్లియర్ చేశామని సీఎం తెలిపారు. పార్టీ పరంగా పార్లమెంట్ స్థాయి వరకు పదవులు భర్తీ చేశామని, త్వరలో రాష్ట్ర కమిటీ నియామకం చేపడతామని చెప్పారు. కూటమి ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మంచి కార్యక్రమాలను నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

నాలుగో రోజుకు శ్రీశైలం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. పెరిగిన భక్తుల రద్దీ

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 15 , 2026 | 12:32 PM