మీడియేషన్ అనేది ఇండియా డీఎన్ఏలోనే ఉంది: సీజేఐ
ABN , Publish Date - Mar 01 , 2026 | 07:47 PM
మధ్యవర్తిత్వం (మీడియేషన్) అనేది ఇండియా డీఎన్ఏలోనే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ స్పష్టం చేశారు. మహాభారతంలో శ్రీ కృష్ణ భగవానుడు మొదటి మధ్యవర్తి (మీడియేటర్)గా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.
విజయవాడ, మార్చి 01: మధ్యవర్తిత్వం (మీడియేషన్) అనేది భారత్ డీఎన్ఏలోనే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ స్పష్టం చేశారు. మహాభారతంలో శ్రీ కృష్ణ భగవానుడు మొదటి మధ్యవర్తి (మీడియేటర్)గా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. అయితే శ్రీకృష్ణుడు ఆ మధ్యవర్తిత్వంలో విజయం సాధించలేదన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆర్బిట్రేషన్ సదస్సులో సీజేఐ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానిది కీలకపాత్ర అని తెలిపారు.
మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయని సీజేఐ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదని కక్షిదారులకు ఆయన సూచించారు. కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. మధ్యవర్తిత్వం వల్ల న్యాయం జరుగుతుందని.. ఇరుపక్షాలకు నమ్మకం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతో ప్రజలు కోర్టులకు వస్తున్నారన్నారు. కొన్ని కేసుల్లో కోర్టులు కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రొత్సాహించాల్సి ఉందని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. మధ్యవర్తిత్వం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందన్నారు. మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోజనాలను అనేక దేశాల్లో తాను స్వయంగా చూశానని ఈ సందర్భంగా సీజేఐ గుర్తు చేసుకున్నారు.
మలేషియాలోని లీగల్ బార్ చాలా కీలకంగా వ్యవహరిస్తోందని సోదాహరణగా వివరించారు. మన దేశంలోనూ ప్రతి స్థాయిలో మధ్యవర్తిత్వం రావాల్సి ఉందని ఆకాంక్షించారు. మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మన దేశంలో పరిశ్రమలు, స్టార్టప్స్ పెరుగుతున్నాయని తెలిపారు. వ్యాపారం, వాణిజ్య పరంగా అనేక వివాదాలు రావడం సహజమని సీజేఐ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మొదటి అంతర్జాతీయ మీడియేషన్ కాన్ఫరెన్స్ దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిందని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మధ్యవర్తిత్వం విషయంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్.. ముఖ్యమంత్రితో చేసిన మీడియేషన్ విజయవంతమైందని వివరించారు. అలాగే రైతులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలితమే రాజధాని అమరావతి అని చెప్పారు. మీడియేషన్‌ను మీ లీగల్, ప్రొఫిషనల్ కల్చర్‌లో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను సీజేఐ సూర్యకాంత్ కోరారు. ఈ కార్యక్రమానికి తాను ఆలస్యంగా రావడం కారణం.. వరుస కార్యక్రమాలు ఉండడమే అని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకాణి గోవర్ధన్ రెడ్డిది కాకి గోల: ఎమ్మెల్యే సోమిరెడ్డి
పోలీస్ కమిషనర్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Read Latest AP News And Telugu News