చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర విచారం
ABN , Publish Date - Aug 27 , 2026 | 10:33 AM
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి చెందారు.
అమరావతి, ఆగస్టు 27: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి చెందారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండ: పల్లా శ్రీనివాసరావు
చిలకలూరిపేట సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ.. మృతుల కుటుంబాలకు పల్లా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పల్లా శ్రీనివాసరావు ఆకాంక్షించారు.
ఏడుగురి మృతి కలచివేసింది: ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాద మృతదేహాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ప్రమాద ఘటనపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. చిలకలూరిపేట పట్టణంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదని.. ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం తనను కలచి వేసిందన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్
నేపాల్ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. ఏపీ వాసులపై ఆరా
Read Latest AP News And Telugu News