ప్రజల్లో సైలెంట్ రివల్యూషన్.. 2024లో ఊహించని విజయం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:44 PM
2024లో ఎవరూ ఊహించని విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు.
అమరావతి, ఆగస్టు 4: 2024లో ఎవరూ ఊహించని విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(మంగళవారం) ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. 2024 నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులపై వాస్తవాలు విడుదల చేసిన సీఎం.. ఈ ప్రజెంటేషన్ బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చే నివేదిక అని చెప్పుకొచ్చారు. సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి.. గవర్నెన్స్ బాగుంటే ప్రజలపై ప్రభావం ఉంటుందన్నారు. 2024లో ఒక సైలెంట్ రివల్యూషన్ ప్రజల్లో వచ్చిందన్నారు. 1982, 1994, తాజాగా 2024లో ఇలాంటి ఫలితాలు చూశామన్నారు. 2024లో 94శాతం స్ట్రయిక్ రేట్ సాధించామని... అది ఊహించని విప్లవమని తెలిపారు. రాష్ట్రవిభజన తరువాత ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రంగా అయిపోయిందని.. 58 శాతం ప్రజలకు 46 శాతం మాత్రమే వనరులు దక్కాయన్నారు. రెండు రాష్ట్రాలను ఉమ్మడిగా అభివృద్ధి చేశామని చెప్పారు.
11.3శాతం వృద్ధి సాధించాం..
ఏపీలో విధ్వంసం జరిగిందని.. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని సీఎం విమర్శించారు. ఎక్కడ చూసినా పాలన దెబ్బతిన్నదని... అధికారులలో కూడా నైతిక స్థైర్యం దెబ్బతిన్నట్లు తెలిపారు. ఓ వ్యక్తి డామేజ్ అయితే పర్వాలేదని.. బ్రాండ్ పోతే చాలా కష్టమన్నారు. ఆనాడు ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు. ఎన్డీఏ వచ్చాక రివైవల్, రీబిల్డ్ స్టార్ట్ చేశామని తెలిపారు. బ్రాండ్ ఆంధ్రా రివైవ్ అయితే మిగిలినవి అన్ని ఆటోమెటిగ్‌గా రివైవ్ చేయగలమని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ప్రజల తలసరి ఆదాయం రూ.95231 కోట్లు అని ముఖ్యమంత్రి తెలిపారు. విభజన తరువాత రూ.93,903 కోట్లు అని.. అంటే తెలంగాణతో పోల్చితే రూ.30,201 కోట్ల గ్యాప్ వచ్చిందన్నారు. అయితే విభజన తరువాత 5 ఏళ్లలో 13.5శాతం వృద్ధి సాధించినట్లు చెప్పుకొచ్చారు. ఇదే వృద్ధి కొనసాగి ఉండి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 10.3 శాతం మాత్రమే వృద్ధి సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం 11.3శాతం వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
సంక్షేమంపై రూ.49,401కోట్లు ఖర్చు
2023-24లో ఏపీకి జీరో డెట్ సస్టైనబిలిటీ అని నీతి అయోగ్ చెప్పిందని.. దీనికి కారణం క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకపోవడమే అని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను మార్టిగేజ్ చేశారని.. లిక్కర్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అప్పుల రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ భారీగా పెంచేశారని... దీంతో అప్పుపుట్టకపోవడంతో కేంద్ర పథకాలను డైవర్ట్ చేశారని ఆరోపించారు. రూ.48616 కోట్ల పెండింగ్ బిల్లులను రూ.29,259 కోట్లకు చెల్లించి తగ్గించగలిగామన్నారు. 86 కేంద్రప్రాయోజిత పథకాలను రివైవ్ చేశామన్నారు. రూ.45,138 కోట్లను కేంద్ర ప్రయోజిత పథకాలు కింద ఖర్చు చేయగలిగామని తెలిపారు. స్థానిక సంస్థలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు వచ్చినా వాటిని మళ్లించారని.. వాటిని కూడా సరిచేసినట్లు సీఎం తెలిపారు. ఇప్పటివరకూ రూ.49,401కోట్లు సంక్షేమంపై ఖర్చు చేశామన్నారు. మెగా డీఎస్సీ విషయంలో కోడిగుడ్లపై ఈకలు పీకుతున్నారంటూ మండిపడ్డారు. లిక్కర్ షాపులు, గనుల కేటాయింపుల్లో ప్రాధాన్యం కల్పించామన్నారు. మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
కిడ్నాప్ కేసు.. గుజరాత్‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
Read Latest AP News And Telugu News