Share News

అలాంటి నాయకత్వంలోనే గొప్ప నగరాలు రూపుదిద్దుకుంటాయి: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Apr 14 , 2026 | 02:47 PM

రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు శతాబ్దాలుగా అభివృద్ధి చెందినవి అనేది నిజమే అని... కానీ అవి పెద్ద నగరాలుగా మారడానికి ఒక దశలో ప్రభుత్వాలు దూరదృష్టితో పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కూడా గుర్తించాలని అన్నారు.

అలాంటి నాయకత్వంలోనే గొప్ప నగరాలు రూపుదిద్దుకుంటాయి: బుద్దా వెంకన్న
Budda Venkanna

అమరావతి, ఏప్రిల్ 14: రాజధాని అమరావతి నిర్మాణంపై ఎక్స్‌ వేదికగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న(Budda Venkanna) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి, నిర్మాణంపై మాజీ ఎంపీకి బహిరంగ లేఖ రాశారు బుద్దా వెంకన్న. ‘అయ్యా విజయసాయి రెడ్డి గారూ.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు శతాబ్దాలుగా అభివృద్ధి చెందినవి అనేది నిజమే. కానీ అవి పెద్ద నగరాలుగా మారడానికి ఒక దశలో ప్రభుత్వాలు దూరదృష్టితో పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కూడా గుర్తించాలి’ అని అన్నారు.


హైదరాబాద్ అభివృద్ధి దీనికి ముఖ్యమైన ఉదాహరణ అని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు. 400 సంవత్సరాలుగా కేవలం చారిత్రక నగరంగా ఉన్న హైదరాబాద్‌లో 26 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హైటెక్ సిటీకి పునాది పడిందని తెలిపారు. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని.. ఐటీ రంగాన్ని ఆకర్షించడానికి చేసిన వ్యూహాత్మక నిర్ణయమని చెప్పుకొచ్చారు. 400 సంవత్సరాలుగా అక్కడ రూ. 1 లక్ష లేని ఎకరం భూమి ధర.. నేడు రూ.100 కోట్లు పైగా పలుకుతోందని బుద్దా వెంకన్న అన్నారు. ఆ సమయంలో అది ‘అవసరం లేని ఖర్చు’ అని విమర్శలు వచ్చినా.. నేడు ఆ హైటెక్ సిటీ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా మార్చిందని తెలిపారు. లక్షలాది ఉద్యోగాలు, ఎంతోమందికి ఉపాధి, అంతర్జాతీయ పెట్టుబడులు, భారీ ఆర్థికవృద్ధికి ఇది పునాది అయిందన్నారు. దూరదృష్టి ఉన్న నాయకత్వం ముందుగానే పెట్టుబడులు పెట్టకపోతే ఇంత అభివృద్ధి సాధ్యం కాదని లేఖలో స్పష్టం చేశారు.


అమరావతి విషయంలో కూడా ఇదే వర్తిస్తుందన్నారు బుద్దావెంకన్న. ముందుగా కేవలం అసెంబ్లీ, సచివాలయం నిర్మించి ఆగిపోతే అది ఒక పరిమిత ప్రభుత్వ నగరంగా మాత్రమే మిగిలిపోతుందని తెలిపారు. పెద్ద స్థాయిలో మౌలిక వసతులు, ఆధునిక డిజైన్లు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి.. ఇవన్నీ కలిసి పెట్టుబడులను, పరిశ్రమలను, ఉద్యోగాలను ఆకర్షిస్తాయని వెల్లడించారు. ‘అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే.. మిమ్మల్ని, మీ జగన్‌మోహన్ రెడ్డిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడని ఎన్నుకున్నారు. ఈ వాస్తవాన్ని మీరు గుర్తించాలి’ అని పేర్కొన్నారు.


రాజధాని కోసం అప్పులు తీసుకోవడం తప్పు కాదని.. అవి సరిగ్గా ఉపయోగిస్తే భవిష్యత్తులో భారీ ఆర్థిక లాభాలు తెస్తాయని టీడీపీ నేత తెలిపారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాలు కూడా మొదట్లో భారీ పెట్టుబడులతోనే నిర్మించబడ్డాయని గుర్తుచేశారు. రాజధాని నగరం అనేది కేవలం కార్యాలయాల సముదాయం కాదని... అది ఒక రాష్ట్రం ప్రతిష్ఠ, ఆర్థిక శక్తి, భవిష్యత్తు అవకాశాల కేంద్రమన్నారు. అందుకే అమరావతిని చిన్నగా ఆలోచించకుండా పెద్దగా, దీర్ఘకాల దృష్టితో నిర్మించాలని అన్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకత్వం ఉన్నప్పుడే భవిష్యత్తులో గొప్ప నగరాలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఇకనైనా అమరావతిపై అనవసరమైన దుష్ప్రచారాలు ఆపి, ప్రజలతో కలిసి అభివృద్ధికి సహకరించాలన్నారు. ‘భవిష్యత్తులో మీరు కూడా మా రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని ఉంది అని గర్వంగా చెప్పుకోవచ్చు’ అంటూ బుద్దా వెంకన్న లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు.. అమరవీరుల స్మృతికి డీజీపీ నివాళి

అంబేడ్కర్ స్ఫూర్తితో రాజకీయ నేతలు ముందుకు సాగాలి: మంత్రి బీసీ జనార్దన్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 02:52 PM