ఏపీలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు.. అమరవీరుల స్మృతికి డీజీపీ నివాళి
ABN , Publish Date - Apr 14 , 2026 | 10:43 AM
అగ్నిమాపక శాఖ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మృతికి నివాళులర్పించారు.
విజయవాడ, ఏప్రిల్ 14: రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని గవర్నర్‌పేటలో అగ్నిమాపక శాఖ హెడ్ క్వార్టర్స్‌లో వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఫైర్ డీజీ వెంకట రమణ పాల్గొన్నారు. అమరవీరుల స్మృతికి నివాళులర్పించిన డీజీపీ.. అనంతరం జెండాను అవగతం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు కేవలం స్మరణ దినం మాత్రమే కాదు. ఈ దేశానికి అగ్నిమాపక శాఖ ఏ సేవలు అందిస్తుందో గుర్తుచేసే రోజు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన అగ్నిమాపక సిబ్బందికి మేము నివాళులర్పిస్తున్నాం’ అని అన్నారు. 1944లో ముంబై విక్టోరియా డాక్‌లో ‘ఎస్.ఎస్. ఫోర్ట్ స్ట్రైన్’ నౌకలో సంభవించిన భారీ పేలుడులో సుమారు 66 మంది అగ్నిమాపక సిబ్బంది సహా 3000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఆ త్యాగం కేవలం చరిత్ర మాత్రమే కాదు.. నేటి అగ్నిమాపక సేవలకు బలమైన పునాది అని డీజీపీ వ్యాఖ్యానించారు.
ప్రమాదం సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి పారిపోవాలని చూస్తారని.. కానీ అగ్నిమాపక సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్లి ప్రాణాలను కాపాడతారని డీజీపీ అన్నారు. ఇది క్రమశిక్షణతో కూడిన ధైర్యం, నిరంతర శిక్షణ, ప్రజల సేవ పట్ల నిబద్ధత అని చెప్పుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అగ్నిమాపక సేవలు విస్తరించాయన్నారు. పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ప్రమాదాల తీవ్రత పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ కేవలం ప్రమాదం జరిగినప్పుడు స్పందించే స్థాయి నుంచి డేటా, సాంకేతికత ఆధారంగా ముందుగానే అప్రమత్తమయ్యే దిశగా మారుతోందని వివరించారు.
బాణసంచా పరిశ్రమలు, పారిశ్రామిక, రసాయన విపత్తులు వంటి అనేక సవాళ్లను చూస్తున్నామని డీజీపీ తెలిపారు. భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాల నిర్వాహకులు బాధ్యతగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ కలిసి భద్రతా పరికరాలను ఏర్పాటు చేసుకుని, నిబంధనలను పాటించాలన్నారు. పౌరులకు అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ చాలా కాలం తర్వాత కొత్త పరికరాలను తీసుకురావడం ద్వారా తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకుందని డీజీపీ వెల్లడించారు. విపత్తు నిర్వహణలో అగ్నిమాపక శాఖ పాత్ర చాలా కీలకమైనదన్నారు. తుఫానులు, వరదలు, భవనాలు కూలిపోవడం, పారిశ్రామిక ప్రమాదాలు, రెస్క్యూ ఆపరేషన్లు ఇలా ఏ విపత్తులోనైనా వారే మొదట స్పందిస్తారని చెప్పారు. అగ్ని ప్రమాదాలను నివారించడం ఉమ్మడి బాధ్యతగా పేర్కొన్నారు. అగ్నిమాపక, పోలీస్, విపత్తు, ఆరోగ్య శాఖలన్నీ కలిసి ఒకే వ్యవస్థగా పనిచేయాలన్నారు. భవిష్యత్తులో అగ్నిమాపక భద్రతలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు.
ప్రజల్లో అవగాహన కల్పిస్తాం: అగ్నిమాపక శాఖ డీజీ
ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు ఫైర్ డీజీ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది థీమ్ ‘సురక్షిత పాఠశాలలు, సురక్షిత ఆసుపత్రులు, అగ్నిమాపక భద్రతపై అవగాహన ఉన్న సమాజం, అగ్ని ప్రమాదాల నివారణకు కలిసి పనిచేస్తాయి’ అని ప్రకటించారు. మార్చి 2025 నుంచి మార్చి 2026 వరకు సుమారు 13,000 ఫైర్ కాల్స్‌కు స్పందించినట్లు వెంకటరమణ వెల్లడించారు. మిచాంగ్ తుఫాను, భారీ వరదలు, బాణసంచా పేలుళ్లు, బస్సు ప్రమాదాల సమయంలో అగ్నిమాపక సిబ్బంది ధైర్యంగా సేవలు అందించారని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1,230 ఆసుపత్రులు, పాఠశాలల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజల్లో భద్రతా అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో 252 కోట్ల రూపాయలతో అత్యాధునిక అగ్నిమాపక పరికరాలు, సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్ కొనుగోలు చేశామని తెలిపారు. ఇటీవల వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఫైర్ డీజీ వెంకటరమణ వివరించారు.
ఇవి కూడా చదవండి...
26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతున్న చిన్నారి.. అంతలోనే
Read Latest AP News And Telugu News