భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు ఘన నివాళి: చంద్రబాబు, లోకేశ్..
ABN , Publish Date - Apr 14 , 2026 | 07:48 AM
ఈరోజు (ఏప్రిల్ 14) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. దేశం కోసం బాబాసాహెబ్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అమరావతి: ఈరోజు (ఏప్రిల్ 14) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ జయంతి. 1891లో మధ్యప్రదేశ్‌లోని మౌలో ఆయన జన్మించారు. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను కోగంటి సహా పలువురు నివాళులు అర్పించారు. దేశం కోసం బాబాసాహెబ్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సీఎం చంద్రబాబు ట్వీట్..
'భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. అంటరానితనంతో కులవివక్షకు గురైనా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేడ్కర్ ఆదర్శప్రాయులు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోందంటే దానికి కారణం ఆయన మనకిచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి' అంటూ ట్వీట్ చేశారు.
మంత్రి లోకేశ్ నివాళి..
'భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందాం' అని అన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను కోగంటి..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను కోగంటి ట్వీట్ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
దార్శనిక నాయకుడు, పండితుడు, భారతరత్న, భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్, స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి అయిన బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయణ్ని స్మరించుకుందాం. సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటం మనకు మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంది' అంటూ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అంబేడ్కర్ తొలి ప్రధాని అయివుంటే...
రెండు రోజుల పర్యటన కోసం తిరుపతికి లోకేశ్