అంబేడ్కర్ తొలి ప్రధాని అయివుంటే...
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:41 AM
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత్ కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, నాగరికత పునర్నిర్మాణ అంచులపై కూడా నిలిచింది. అలాంటి సమయంలో నాయకత్వం కేవలం పరిపాలనను మాత్రమే కాకుండా దేశ స్వరూపాన్ని, భవిషత్తును నిర్ణయిస్తుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత్ కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, నాగరికత పునర్నిర్మాణ అంచులపై కూడా నిలిచింది. అలాంటి సమయంలో నాయకత్వం కేవలం పరిపాలనను మాత్రమే కాకుండా దేశ స్వరూపాన్ని, భవిషత్తును నిర్ణయిస్తుంది. ఆ సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ పదవిలోకి వచ్చారు. కానీ అదే కాలంలో అత్యంత నిర్మాణాత్మకంగా ఆలోచించే మరో మహత్తర మేధస్సు అధికారానికి దూరంగా నిలిచింది. అది డా. బి.ఆర్.అంబేడ్కర్. ఆయన కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాదు, భారతదేశాన్ని ఒక సంక్లిష్ట జీవిగా అర్థం చేసుకున్న తత్వవేత్త, సామాజికంగా విభజితమైన, ఆర్థికంగా అసమానమైన, వ్యూహాత్మకంగా బలహీనమైన దేశంగా చూశాడు. ఆయన దృష్టి అలంకారాత్మకమైనది కాదు; అది పునాది స్థాయిలో ఉన్నది. ఆయన భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా ఉంటే, ఈ గణతంత్రం కేవలం స్వేచ్ఛా దేశంగా మాత్రమే కాకుండా, ఈ రోజుకి ఒక ప్రపంచ శక్తిగా ఎదిగేది. ఇప్పుడు భారత్ విభజన, దాని వల్ల ఏర్పడ్డ నిరంతర సమస్యలను పరిశీలిద్దాం.
స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న మొదటి, అత్యంత కీలక సమస్య విభజనే. అనేకమంది నాయకులు దీనిని భావోద్వేగపూరితంగా, ఒక విషాద ఘట్టంగా చూశారు. కానీ అంబేడ్కర్ దీనిని విశ్లేషణాత్మకంగా చూశారు. తన ‘Pakistan or the Partition of India’ అనే గ్రంథంలో, ఆయన ఒక కఠినమైన, అవసరమైన ప్రశ్నను లేవనెత్తారు: తమను తాము వేర్వేరు జాతులుగా భావించే రెండు సమూహాలు నిరంతర ఘర్షణ లేకుండా కలిసి జీవించగలవా? ముస్లింలకు ప్రత్యేక దేశం కోసం జిన్నా చేసిన డిమాండ్‌ను అంబేడ్కర్ అనివార్యంగా మాత్రమే కాకుండా, ఒక అవకాశంగా కూడా చూశారు. కానీ చరిత్రలో చోటుచేసుకున్న అస్తవ్యస్తతకు బదులుగా, అంబేడ్కర్ పథకం ప్రకారం వ్యవహరించేవారు. తొందర పాటుతో జరిగిన విభజనకు బదులుగా, ఆయన దశలవారీ మార్పును నిర్దేశించేవారు. 1) హడావిడిగా కాకుండా రెండు నుంచి మూడు సంవత్సరాల ప్రణాళికబద్ధంగా విభజన జరిగేది. 2) స్పష్టమైన సరిహద్దుల నిర్ధారణ జరిగేది. 3) భూభాగ విభజన, ఆస్తుల విభజన జనాభాకు అనుగుణంగా ఉండేది. ఉదాహరణకు విభజన సమయంలో భారత్‌లోని మొత్తం ముస్లిం జనాభాలో కేవలం 60శాతం పాకిస్థాన్‌లో స్థిరపడ్డారు, కాని 40శాతం భారత్‌నే ఎంచుకున్నారు. 3) ముఖ్యంగా ఆయన భారత్–పాకిస్థాన్ మధ్య సంపూర్ణ జనాభా మార్పిడిని గ్రీకు–టర్కీ నమూనాలో ప్రతిపాదించారు. దీని ద్వారా దీర్ఘకాలిక సామాజిక అస్థిరతను నివారించవచ్చని ఆయన నమ్మారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం, కోట్ల మంది నిరాశ్రయులుకావడం వంటి విషాదాలు గణనీయంగా తగ్గేవి. విభజన తాత్కాలిక బాధ, దీర్ఘకాల లబ్ధిగా మారేది.
అంబేడ్కర్ ప్రధానమంత్రిగా జమ్మూ–కశ్మీర్‌ను తక్షణం, పూర్తిగా రాజ్యాంగపరంగా ఏకీకృతం చేసేవారు. దీర్ఘకాల అంతర్జాతీయీకరణ, అనిశ్చితి ఉండేవి కాదు. ఆర్టికల్ 370 వంటి ప్రత్యేక హోదాను అంగీకరించేవారు కాదు. మొత్తం కశ్మీర్ భారతదేశంలో ఒక సాధారణ రాష్ట్రంలా కలిసిపోయేది.
ఆర్థిక శాస్త్రవేత్తగా, జల విధాన నిపుణుడిగా, ఆయన నదులను జాతీయ శక్తి సాధనాలుగా చూశారు. ఇండస్ నదులపై ప్రవాహ వినియోగాన్ని గరిష్ఠంగా పెంచేవారు, ముందుగానే సాగునీటి మౌలిక సదుపాయాలను నిర్మించేవారు, ఏ ఒప్పందాన్నైనా పరస్పర ప్రయోజనం–వ్యూహాత్మక లాభాల ఆధారంగా చర్చించేవారు. ఆయన దృష్టిలో నీరు కేవలం జలశక్తిగా కాకుండా దేశానికి సైనిక శక్తిగా మార్చేవారు. నదుల అనుసంధానం, అలానే అంతర్రాష్ట్ర నీటి తగాదాలు లేకుండా ఒక స్పష్టమైన జాతీయ విధానం అమలు చేసేవారు.
టిబెట్‌ను ఒక బఫర్ ప్రాంతంగా కోల్పోవడం వల్ల కలిగే పరిణామాలను అంబేడ్కర్ ముందుగానే అంచనా వేశారు. టిబెట్ స్వతంత్రత కోల్పోతే, భారతదేశం చైనాతో ప్రత్యక్ష ఒత్తిడిని ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఆయన విధానం చైనా విస్తరణకు వ్యతిరేకంగా బలమైన రాజనీతి చర్యలు తీసుకునేందుకు, టిబెట్ స్థితిని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడం అయ్యేది. అలాగే నేపాల్–మయన్మార్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాలు లేదా ఏకీకరణ ద్వారా ఒక రక్షణ వలయాన్ని సృష్టించేవారు.
విభజనతో భారతదేశం సెంట్రల్ ఆసియాతో తన సంబంధాన్ని కోల్పోయింది. ఇది అంబేడ్కర్ అంగీకరించేవారు కాదు. ఆయన ఆర్థిక భౌగోళిక దృష్టిలో, సరిహద్దు ప్రాంతాల ద్వారా ట్రాన్సిట్ కారిడార్లను ఏర్పరచి, భారతదేశం ఖండాంతర వాణిజ్య మార్గాలతో అనుసంధానంగా ఉండేలా చేసేవారు. విభజనకు ముందు షరతుగా దీనిని ఉంచేవారు.
కలాత్ (బలోచిస్తాన్) సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి వచ్చిన అవకాశాన్ని జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించడం వ్యూహాత్మక లోపంగా మారింది. ఖాన్ ఆఫ్ కలాత్ చేసిన విలీన అభ్యర్థనను అంగీకరించి ఉంటే, గ్వాదర్ పోర్ట్ ప్రాప్తి, ఇరాన్–అఫ్గానిస్తాన్‌తో భౌగోళిక అనుసంధానం లభించేవి, భారతదేశ ఆర్థిక, భౌగోళిక పరపతి ప్రపంచానికి అనివార్యం కల్పించేది.
సంస్థానాల విలీన ప్రక్రియను అంబేడ్కర్ మరింత కఠినంగా అమలుచేసేవారు. హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా విలీనం చేశారు. అంబేడ్కర్ నేతృత్వంలో ఇది మరింత ముందుగానే జరిగి ఉండేది.
గోవా 1961 వరకు పోర్చుగీసు వలస పాలనలో కొనసాగడం అంబేడ్కర్ దృష్టిలో సరికాదు. ఆయన ఒక కచ్చితమైన కాలపరిమితి విధించి, అవసరమైతే తక్షణ చర్య తీసుకునేవారు. సార్వభౌమత్వం విషయంలో ఆయన ఏ మాత్రం రాజీపడేవారు కారు.
ఒక ఆర్థికవేత్తగా, దూరదృష్టితో స్టేట్ సోషలిజం విత్ ప్రైవేట్ క్యాపిటలిజం అనే సిద్ధాంతంతో, 1991లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల మోడల్ ప్రవేశపెట్టేవారు. భూసంస్కరణలు, పారిశ్రామీకరణ, లేబర్ రైట్స్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్, ఆర్థిక విప్లవానికి నాంది పలికేవారు.
చిన్న రాష్ట్రాలు, అభివృద్ధికి సోపానాలని ఆయన నమ్మకం. అందుకే ఆర్టికల్ 3లో పొందుపరిచారు అంబేడ్కర్. ఎలాంటి ప్రాణనష్టం, ఉద్యమాలు లేకుండా భాష ఆధారిత, ప్రాంత ఆధారిత చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఎప్పుడో జరిగేది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఎప్పుడో ఏర్పడేవి. తెలంగాణ మొదట నుంచి ప్రత్యేక రాష్ట్రంగానే ఉండేది.
అంబేడ్కర్ మొదటి నుంచి మహిళా సాధికారత, సమాన హక్కులు, రాజకీయ, ఆర్థిక సమతుల్యత కోసం పోరాడారు. కేంద్ర మంత్రిగా ఆయన రాజీనామాకు కారణం మహిళా సాధికారత కోసం తాను ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్‌ను నెహ్రూ వ్యతిరేకించడమే.
భారత్ బలంగా, ఐక్యంగా ఉండాలంటే, పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం సురక్షితంగా ఉండాలంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకోసం ఫెడరేషన్ కాకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్‌గా అభివర్ణించారు. ఐక్యత కంటే ఏకతకు ప్రాధాన్యం ఇచ్చారు.
బీసీ కమిషన్ ఏర్పాటుకు పట్టు పట్టారు. అలాగే రిజర్వేషన్ అనే పదం కాకుండా రిప్రజెంటేషన్ అనే పదం వాడారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య రిజర్వేషన్స్ ద్వారా భారత కులాల ఐక్యతకు, ఏకీకరణ కొరకు పాటుపడ్డారు. దురదృష్టవశాత్తు ఇందుకు నెహ్రూ సహకరించలేదు. విద్య విముక్తికి మార్గమని, ప్రజలందరికీ ప్రయోజనకరమైన విద్యనందించడం ప్రభుత్వ బాధ్యతగా అంబేడ్కర్ భావించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడే రెండో రాజధాని అవసరం అని, అందుకు హైదరాబాద్ అనుకూల ప్రాంతమని ఎప్పుడో అంబేడ్కర్ చెప్పారు. ఇప్పుడు భారత్ ఆలోచిస్తోంది. అందుకోసమే రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్ వేదిక అయ్యింది.
ఒక సామాజిక సంస్కర్త, విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు, న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, శ్రామికవర్గ సంస్కర్త, మహిళా సాధికారత సాధన ప్రదాత, నీటి నిపుణుడు, రాజ్యాంగ ప్రదాత, విదేశీ వ్యవహారాల నిపుణుడు, ముఖ్యంగా ప్రగాఢ దేశభక్తుడు అయిన అంబేడ్కర్‌ను కులం ఆధారిత రిజర్వేషన్ అంశానికి పరిమితం చేయడం శోచనీయం.
అంబేడ్కర్ భారత తొలి ప్రధానిగా ఉన్నట్లయితే, ప్రజాస్వామ్యం, జనాభా నిర్మాణం, భౌగోళికత, ఆర్థిక ప్రగతి, వంశ పారంపర్య రాజకీయాలు... ఇవన్నీ మరింత స్పష్టంగా ఉండేవి. విభజన శాశ్వత సమస్యగా కాకుండా, ఒక ముగింపు దశగా మారేది. అంబేడ్కర్ కేవలం స్వతంత్ర భారతదేశాన్ని మాత్రమే ఊహించలేదు; న్యాయసమ్మతమైన భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా భావించారు. అంబేడ్కర్ ప్రధానమంత్రిగా ఉండివుంటే సింగపూర్ లీ క్వాన్ యూ శైలిని పోలి ఉండేది. భారతదేశం ఇప్పటికే ఒక గ్లోబల్ సూపర్ పవర్ అయి ఉండేది. స్వతంత్ర భారతదేశ నాయకత్వాన్ని ఆయనకు దక్కకపోనివ్వడం వల్ల మన జాతి ఒక గొప్ప ఆరంభాన్ని, అవకాశాన్ని కోల్పోయింది.
- డా. బూర నర్సయ్యగౌడ్
బీజేపీ ఉపాధ్యక్షులు, తెలంగాణ