రైతులను ఆదుకోవాలి: కేంద్ర మంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ
ABN , Publish Date - Oct 28 , 2026 | 08:03 PM
'ఆర్నాబ్' తుఫాను తీవ్రంగా కుదిపేసింది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రహదారులు దెబ్బతినడంతో పాటు, అన్నదాతలు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలను చేపట్టింది.
అమరాతి, అక్టోబర్ 28: రాష్ట్రాన్ని 'ఆర్నాబ్' తుఫాను తీవ్రంగా కుదిపేసింది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రహదారులు దెబ్బతినడంతో పాటు, అన్నదాతలు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. ఆర్నబ్ తుఫానుకు సంబంధించిన వివరాలను మంత్రి బి.సి. జనార్దన రెడ్డి వెల్లడించారు. తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ మేర రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 111.665 కి.మీ., తూర్పుగోదావరిలో 14.5 కి.మీ. మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న 9 కల్వర్టు పనుల్లో 6 చోట్ల పునరుద్ధరణ పూర్తి చేయగా, రహదారులపై నేలకొరిగిన 1,058 చెట్లలో 859 చెట్లను తొలగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిన 57 చోట్లలో 20 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. రహదారులు, మౌలిక వసతుల తాత్కాలిక పునరుద్ధరణకు రూ. 9.18 కోట్లు, శాశ్వత పనులకు రూ. 50.27 కోట్లు కలిపి మొత్తం రూ. 59.45 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు.
తుఫాను కారణంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 2,24,489 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీటమునిగి సుమారు 3.45 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. 154 మండలాల్లో 2,11,726 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతినగా, అందులో అత్యధికంగా 2,09,460 హెక్టార్లు వరి పంటనే కావడం గమనార్హం. పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వరి విస్తీర్ణం భారీగా నీటమునిగింది. అలాగే 12,763 హెక్టార్లలో అరటి, కొబ్బరి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ముందస్తుగా 1.05 కోట్లకు పైగా సూచనలు జారీ చేసినప్పటికీ ప్రకృతి ప్రకోపాన్ని ఆపలేకపోయారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. సమగ్ర నివేదిక అందేలోపు అత్యవసర సహాయం కోసం ముందస్తు నిధులు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు స్వయంగా పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో పర్యటించారు. చిట్టి ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డు, పూలే కాలనీ, పోస్ట్ ఆఫీస్ రోడ్లను పరిశీలించి, మున్సిపల్ సిబ్బందితో కలిసి యుద్ధప్రాతిపదికన నీటి తొలగింపు పనులను దగ్గరుండి చేయించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలూ చదవండి
AAVGF ఆధ్వర్యంలో అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో 2K వాక్
ఆర్నబ్ తుఫాన్‌తో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట