Share News

జూన్ 21న 25,000 మందితో యోగా: కలెక్టర్ లక్ష్మీ శా

ABN , Publish Date - Jun 05 , 2026 | 03:31 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర 2026 నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికీ యోగాను చేరువ చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.

జూన్ 21న 25,000 మందితో యోగా: కలెక్టర్ లక్ష్మీ శా
Yogandhra 2026

ఎన్టీఆర్ జిల్లా, జూన్ 5: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర 2026 నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికీ యోగాను చేరువ చేయడం ప్రధాన లక్ష్యమన్నారు. ‘థీమ్ యోగా’ కార్యక్రమం ఈనెల 7న పోలీస్ సిబ్బందితో నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత పర్యాటక ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పవిత్ర సంగమం దగ్గర 10వ తేదీన యోగాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


జూన్ 15, 16, 17 తేదీల్లో యోగా ఒలింపియాడ్ పోటీలను ప్రభుత్వం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీ లెవెల్‌లో 5000 మందికి పైగా యోగా ట్రైనర్స్‌గా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ 5000 మంది యోగా టీచర్స్.. ప్రజలకు యోగా శిక్షణ కార్యక్రమాలను 15 రోజుల పాటు నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలాగా ఆయా ప్రదేశాలలో యోగా సాధన ద్వారా అధిక సంఖ్యలో ప్రజల భాగస్వామ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో నిత్య యోగా కార్యక్రమం జరుగుతోందన్నారు. జూన్ 21న అమరావతి మిషన్ బైపాస్ బ్రిడ్జ్ వద్ద కృష్ణా నదిపై పెద్దఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. ఇందులో దాదాపు 25,000 మంది పాల్గొంటారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యోగా కార్యాక్రమంలో పాల్గొననున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా కలిపి దాదాపు కోటి మంది ఈ యోగా సాధనలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీ శా పేర్కొన్నారు.


పోలీస్ థీమ్‌తో ‘యోగాంజలి 2026’: సీపీ

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యోగాంజలి 2026 కార్యక్రమాన్ని పోలీస్ థీమ్‌తో నిర్వహించేందుకు నిర్ణయించామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 లో భాగంగా గంజాయి వినియోగిస్తున్న చాలా మందిని గుర్తించామన్నారు. వారితో ఒక యోగా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. గంజాయి కేసుల్లో డ్రగ్ పాజిటివ్‌గా గుర్తించిన వారందరినీ ఈసారి ఈ 'యోగాంజలి 2026' కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తామని అన్నారు. పోలీస్ శాఖకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఎంతో అవసరమన్నారు. అందుకే యోగా, మెడిటేషన్‌ను ఒక థీమ్‌గా తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. జూన్ 7వ తేదీ బీఆర్‌టీఎస్ రోడ్‌లో సుమారు 3,000 నుంచి 4,000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు.


జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున 25,000 మందితో కృష్ణా నది బ్రిడ్జ్‌పైన యోగా నిర్వహించనున్నామని సీపీ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, అద్భుతంగా నిర్వహిస్తామన్నారు. జూన్ 7 నుంచి 21 వరకు 15 రోజుల పాటు జిల్లాలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా హోం మంత్రి వంగలపూడి అనితను ఆహ్వానించినట్లు సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 03:42 PM