Share News

31 శాఖల్లో పెండింగ్‌ కేసులు.. సీఎస్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:34 AM

ఏపీ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా చర్యల కేసులపై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7,827 క్రమశిక్షణా కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 11,600 మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

31 శాఖల్లో పెండింగ్‌ కేసులు.. సీఎస్ కీలక ఆదేశాలు
AP Government

అమరావతి, జులై 7: ఏపీ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా చర్యల కేసులపై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7,827 క్రమశిక్షణా కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 11,600 మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పెండింగ్ కేసులను కాలపరిమితిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమశిక్షణా కేసులను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల్లో నోడల్ అధికారులను నియమించాలని సర్కార్ ఆదేశించింది. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పీరియాడిక్ రివ్యూ మెకానిజాన్ని అమలు చేయనున్నారు. అలాగే ప్రతి కేసును ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసే విధంగా ఈ-విజిలెన్స్ (e-Vigilance) వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నారు.


జులై 8లోగా అన్ని శాఖల్లో నోడల్ అధికారుల నియామకం పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. జులై 10లోగా పాత క్రమశిక్షణా కేసులను ఈ-విజిలెన్స్‌లో మ్యాపింగ్ చేయాలని, జులై 14లోగా విచారణ అధికారుల సమీక్ష పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జులై 17న జిల్లా కలెక్టర్ల స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. జులై 18లోగా పాత కేసుల పూర్తి వివరాలను ఈ-విజిలెన్స్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జులై 21న అన్ని శాఖాధిపతులతో తొలి సమీక్ష నిర్వహించనున్నారు. జులై 28న కార్యదర్శుల స్థాయిలో సమీక్ష చేపట్టనున్నారు. అనంతరం ఆగస్టు 4న చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి కేసుల పురోగతిని పరిశీలించనున్నారు.


పెండింగ్ క్రమశిక్షణా కేసులు అత్యధికంగా రవాణా, రోడ్లు అండ్ భవనాల శాఖలో 1,482.. హోం శాఖలో 1,423 కేసులు.. రెవెన్యూ (ల్యాండ్స్) శాఖలో 1,226 కేసులు.. వైద్య, ఆరోగ్య శాఖలో 574 కేసులు.. మున్సిపల్ పరిపాలన శాఖలో 475 కేసులు ఉన్నాయి. మొత్తం 31 ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా కేసులపై ప్రభుత్వం ప్రత్యేక సమీక్ష నిర్వహించనుంది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అన్ని శాఖలూ చర్యలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతంలో సీఐ నాగరాజుపై మరో కేసు

లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 11:38 AM