ప్రజలు కోరినా అన్న క్యాంటీన్లను వైసీపీ మూసేసింది: మంత్రి నారాయణ ఫైర్..
ABN , Publish Date - May 14 , 2026 | 09:07 PM
విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట అన్న క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.
విజయవాడ: కృష్ణలంక, రాణిగారితోటలోని అన్న క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ (గురువారం) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. రూ.5 చెల్లించి టోకెన్ తీసుకున్న మంత్రి.. అందరితో కలిసి భోజనం చేశారు. ఆయనతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర ఉన్నారు.
అనంతరం క్యాంటీన్లలో ప్లేట్లు శుభ్రపరిచే విధానం, ఆహారం వడ్డించే ప్రాంతాల్లో పరిశుభ్రత, మినరల్ వాటర్, కూలర్లు, దోమతెరలు, ప్రత్యేక పార్కింగ్ వంటి సదుపాయాలను మంత్రి పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలను నేరుగా అడిగి ఆహారం నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 'అన్న క్యాంటీన్లలో పరిశుభ్రమైన వాతావరణంలో ఎంతో రుచికరమైన ఆహారం అందిస్తున్నారు. పేదలకు నాణ్యమైన భోజనం అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం' అని అన్నారు. గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత కోరినా అన్న క్యాంటీన్లను మూసివేసిందని విమర్శించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ల నిర్వహణలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వారానికి ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్తగా అన్న క్యాంటీన్లు ప్రారంభించామని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 3.5 లక్షల మంది అన్న క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు: మంత్రి డీబీవీ స్వామి
ఆర్డీటీ ఓ సంస్థ కాదు.. గొప్ప సేవా వ్యవస్థ: నారా లోకేశ్