మిషన్ కర్మయోగిలో ఆంధ్రప్రదేశ్ భేష్: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:11 PM
దేశవ్యాప్తంగా అమలవుతున్న మిషన్ కర్మయోగిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికత ఆధారిత శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు మెరుగుపడుతోందని.. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రశంసించారు.
అమరావతి: దేశవ్యాప్తంగా అమలవుతున్న మిషన్ కర్మయోగి (Mission Karmayogi)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. సాంకేతికత ఆధారిత శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు మెరుగుపడుతోందని.. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రశంసించారు. ఐజీఓటీ (Integrated Government Online Training)లో ఏపీ తరఫున కోటికిపైగా కోర్సులు పూర్తి చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్మయోగి భారత్ చేసిన ట్వీట్‌ను ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు రీట్వీట్ చేశారు.
ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరో ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు 'సాధన సప్తాహ' జాతీయ లెర్నింగ్ వీక్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వారం రోజులపాటు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు చురుకుగా పాల్గొని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కోర్సును పూర్తి చేయడం తప్పనిసరి చేయడం జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వ్యవస్థను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మార్చి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాలనే లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పెట్టుకుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని, సామర్థ్యాలను పెంచుకోవాలని కోరారు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడం, మెరుగైన సేవలు అందించడమే 'సాధన సప్తాహ' ఉద్దేశమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రోకలి బండతో..
అయ్యో పాపం.. వివాహానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు..