ఈ ఏడాది రెండున్నర లక్షల మందితో యోగా: మంత్రి సత్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:42 PM
ఈ ఏడాది జూన్ 7 నుంచి 21 వరకు15 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. పొదుపు చర్యల్లో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్లు తెలిపారు.
అమరావతి, జూన్ 1: ఈ ఏడాది జూన్ 7 నుంచి 21 వరకు15 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. పొదుపు చర్యల్లో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్లు తెలిపారు. జూన్ 21న ప్రధాన యోగా కార్యక్రమం వెస్ట్రన్ బైపాస్ రోడ్డుపై నిర్వహించాలనే దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు, బీఆర్ అంబేద్కర్ కోనసీమలో రైతులు, కృష్ణా జిల్లాలో లారీ ఓనర్ల అసోషియేషన్ ద్వారా యోగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది రెండున్నర లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలిపారు. వెస్ట్రన్ బైసాప్‌లో 25 వేల మందితో యోగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
2020-25 వరకు మెంటల్ హెల్త్ విషయంలో సగటున 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని సత్యకుమార్ తెలిపారు. డయాబెటిక్స్, హైపర్ టెన్షన్‌ల కేసులు విపరీతంగా పెరగుతున్నాయన్నారు. అందుకే ఆధునిక జీవన విధానంలో ధ్యానం చాలా అవసరమన్నారు. జూన్ 1 నుంచి 30 వరకు యోగాకు సంబంధించి యూట్యూబ్ వీడియోలను 3 నిముషాల నుంచి గంట వరకు మంతెన సత్యనారాయణ రాజు తయారు చేసినట్లు తెలిపారు. యోగాను విద్యా కరిక్యులమ్‌లో కూడా చేర్చడం జరిగిందని... వేసవి కాలం తరువాత విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. జూన్ 1 నుంచి జూన్ 20 వరకు యోగాలో వివిధ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం మీడియా కూడా సహకరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.
యోగాపై అనుమానాలు పోగొట్టేలా 50 వీడియోలు: మంతెన
జూన్ నెలను ఫిజికల్, మెంటల్ హెల్త్‌కు అంకితం చేసుకోవాలని యోగా, నేచరోపతి సలహదారు మంతెన సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. 90 వీడియోలను ఒక్కొక్కటి 5 నిముషాల నిడివితో రెడీ చేసినట్లు తెలిపారు. 21 వ్యాధులకు సంబంధించి థెరపిటిక్ యోగా వీడియోలు 15 నిముషాలు ఉండేలా తయారు చేశామన్నారు. యోగా పట్ల ఉన్న అనుమానాలు, అపోహలు పోగొట్టేలా 50 వీడియోలు చేసినట్లు చెప్పారు. వీటిని డౌన్ లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 8142404888 అనే వాట్సాప్ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెడితే గూగుల్ లింక్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంతెన సత్యనారాయణ రాజు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గొడ్డలి పార్టీ కుట్రలను బయటపెట్టిన మంత్రి అనగాని సత్యప్రసాద్
దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News