Share News

ఎల్‌పీజీ సరఫరాపై మంత్రుల కీలక సమావేశం

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:43 PM

ఏపీలో గ్యాస్ సరఫరాపై మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు. సివిల్‌ సప్లైస్ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై చర్చించారు.

ఎల్‌పీజీ సరఫరాపై మంత్రుల కీలక సమావేశం
AP LPG Supply

అమరావతి, మార్చి 14: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎల్‌పీజీ సరఫరాపై ఏపీ ప్రభుత్వం నిత్యం పర్యవేక్షణ చేస్తోంది. దీనిలో భాగంగా నేడు(శనివారం) సివిల్ సప్లైస్ భవన్‌లో పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై విస్తృత చర్చ జరిగింది.


రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నాటికి ఎల్‌పీజీ నిల్వలు 17,962 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. మొత్తం ఎల్‌పీజీ కనెక్షన్లు 161.19 లక్షలకు చేరాయి. ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా సరఫరా అంతరాయం లేదని అధికారులు స్పష్టం చేశారు. భారత్ వినియోగించే ఎల్‌పీజీలో 60 శాతం దిగుమతులు మాత్రమే. వాటిలో 90 శాతం హార్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ఈ నేపథ్యంలో రిఫైనరీలకు ఎల్‌పీజీ ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోందని కేంద్రం పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఎల్‌పీజీని పూర్తి స్థాయిలో గృహ వినియోగదారులకు మళ్లించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు నాన్-డొమెస్టిక్ ఎల్‌పీజీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లకు ఎల్‌పీజీ కేటాయింపులపై ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కమిటీ సమీక్ష చేస్తోంది.


ఏపీలో గృహ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.935గా ఉంది. దీపం - 2 పథకం కింద అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లకు 100 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. గ్యాస్ సరఫరా నియంత్రణకు మార్చి 9న నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్ జారీ చేయగా, గృహ పీఎన్‌జీ(PNG), వాహనాల సీఎన్‌జీ(CNG) సరఫరాకు 100 శాతం సరఫరా కొనసాగుతోంది. ఎలాంటి కోతలు లేవు. పరిశ్రమలకు గత ఆరు నెలల సగటు వినియోగంలో 80 శాతం, ఎరువుల కర్మాగారాలకు 70 శాతం కొనసాగుతుండగా.. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లకు 35 శాతం సరఫరా తగ్గించారు. పానిక్ బుకింగ్, నిల్వలు చేసే పరిస్థితి మీద ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గృహ ఎల్‌పీజీ సాధారణ డెలివరీ సమయం రెండు నుంచి ఐదు రోజులు మాత్రమే. ఎల్‌పీజీ బుకింగ్ మధ్య గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. ఇంధన సరఫరా అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


నిన్న(శుక్రవారం) మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ నాయకులు కలిశారు. తక్షణం తమకు గ్యాస్ సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హోటళ్లు నడపలేమని యజమానులు స్పష్టం చేశారు. ఈ అంశంపై కూడా ప్రస్తుత సమావేశంలో మంత్రులు, అధికారులు చర్చించారు.


ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

గ్యాస్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 14 , 2026 | 01:58 PM