ఇంధనాన్ని పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:05 PM
పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్పప్పటికీ.. లేదని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఇంధన సమస్యపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి, ఏప్రిల్ 28: ఇంధన సమస్యపై మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధనాన్ని పక్కదోవ పట్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్నా సరే.. లేదని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినియోగదారుల సేవా కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 1967కు వచ్చిన ఫిర్యాదుల్లో అధిక భాగం పెట్రోల్ బంకులు ఇంధనం ఇవ్వడం లేదని వస్తున్నాయన్నారు. ఈ ఫిర్యాదులపై జిల్లావారీగా రిపోర్టులు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో పెట్రోల్ బంకుల మూసివేతలు క్రమంగా తగ్గుతున్నాయని మంత్రి తెలిపారు. ఆయిల్ కంపెనీల నుంచి డిస్పాచ్‌లు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. వస్తున్న లోడ్లు వాహనదారులకు పూర్తిస్థాయిలో అందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఆక్వా రైతులు ప్రస్తుతం కీలక సమయంలో ఉన్నారని.. వారికి ఏ పరిస్థితుల్లోనూ ఇంధన కొరత రాకుండా చూడాలని తెలిపారు. రబీ పంట కోతల సమయంలో కూడా రైతులకు ఆయిల్ సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే ఉన్నతాధికారులు వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేయాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసేవారిపై నిఘా ఉంచాలని సూచనలు చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు నిరంతర సమీక్ష, సమన్వయం అవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అమరావతి - హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
భారత డిజిటల్ భవిష్యత్తుకు విశాఖ నూతన ద్వారం: జీత్ అదానీ
Read Latest AP News And Telugu News