Share News

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:05 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే
AP Cabinet Meeting

అమరావతి, జూన్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 2011 కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అవయవ మార్పిడి ప్రక్రియలో పారదర్శకత, వైద్య సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయనున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.


మరికొన్ని కేబినెట్‌ నిర్ణయాలు..

బీచ్ షాక్స్ పాలసీకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భీమిలి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చీరాల బీచ్‌లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పాలసీ అమలు చేయనున్నారు. గోవా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే బీచ్ షాక్స్‌లు తెరిచి ఉంచడానికి అనుమతి ఇవ్వనున్నారు. పరిమిత రకాల మద్యం విక్రయాలకు మాత్రమే అనుమతి ఉండనుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే తదుపరి విస్తరించే అవకాశం ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఏవియేషన్, ఉపాధి, మత్స్యరంగం, పోలవరం, పారిశ్రామిక పార్కులు, పోర్టులు, పర్యాటకం వంటి వివిధ రంగాల్లోని ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపును ఆమోదించింది.


ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025 ముసాయిదాకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మద్దువలస, యేలేరు రిజర్వాయర్లలో ఫిషిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ-2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసుల పరిష్కారం కోసం 21 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖ భూమిపై PM-KUSUM పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు NREDCAPకు 30 ఏళ్ల లీజు ఇవ్వడానికి అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయిం తీసుకుంది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు HUDCO నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.


కృష్ణా నది తీరంలో ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. రాజధాని అమరావతిలో పలు నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎంపికై.. వివిధ కారణాలతో సీపీఎస్ అమలు తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పింఛను వ్యవస్థ అమలు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీలో సవరణలకు కేబినెట్ ఆమోదించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్ (VB-GRAMG)ను జులై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.


ఇవి కూడా చదవండి...

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

బలమైన భారత్‌ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 04:48 PM