విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:48 PM
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రెవెన్యూ లోటును తగ్గించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 17: ఏపీ శాసనసభలో బడ్జెట్‌పై చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (MLA Prathipati Pullarao) మాట్లాడారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేదిగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. మూలధన వ్యయాన్ని భారీగా పెంచడం ద్వారా ఆస్తులు సమకూరుతాయన్నారు. రెవెన్యూ లోటును తగ్గించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచారని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 50 వేల కోట్లకు పైగా కేటాయించడం ద్వారా ఇది నిజమైన రైతు ప్రభుత్వమని నిరూపించారని పుల్లారావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 6 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకున్నారని, రైతు నష్టపోతే రాష్ట్రం నష్టపోతుందని ఆయన అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రూ.91 వేల కోట్లు కేటాయించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 'తల్లికి వందనం' పథకం ద్వారా విద్యార్థికి రూ.15 వేలు అందిస్తున్నామని చెప్పారు. అత్యధిక సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని తెలిపారు. దేశంలో అత్యధిక పెట్టుబడులు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారన్నారు. అప్పుల చీకట్లో ఆశాదీపంగా వెలిగిన బడ్జెట్ ఇదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హర్యానా నిట్ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఎమ్మెల్యేలు సభకు రాకపోతే జీతాలు కట్.. ప్రజలు రీకాల్ చేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Read Latest AP News And Telugu News