Share News

రాళ్లపాడు రిజర్వాయర్‌‌పై సభ్యుల ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:35 AM

రాళ్లపాడు రిజర్వాయర్, ఎడమ కాలువ పనుల పురోగతిపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్ళపాడు ఎడమ ప్రధాన కాలువ విస్తరణకు రూ.36.50 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టామని గుర్తుచేశారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి, టెండర్లను ప్రీక్లోజర్ చేసిందని విమర్శించారు.

రాళ్లపాడు రిజర్వాయర్‌‌పై సభ్యుల ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే
AP Assembly

అమరావతి, ఫిబ్రవరి 17: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని రాళ్ళపాడు రిజర్వాయర్, ఎడమ కాలువ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) సమాధానం ఇచ్చారు. రాళ్ళపాడు రిజర్వాయర్ 1.10 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో 16 వేల ఎకరాలకు సాగు, 116 గ్రామాలకు తాగు నీరందిస్తోందని తెలిపారు. కుడి కాలువ ద్వారా 14,500 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ 1500 ఎకరాలకు సాగునీరు అందుతోందని మంత్రి వివరించారు.


నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్ళపాడు ఎడమ ప్రధాన కాలువ విస్తరణకు రూ.36.50 కోట్ల నిధులు కేటాయించి పనులు చేట్టినట్లు తెలిపారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి, టెండర్లను ప్రీక్లోజర్ చేసిందని విమర్శించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో రిజర్వాయర్ గేట్ల మరమ్మత్తులకు, గ్రీజుపెట్టడానికి, మెయింటెన్స్ పనులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2024 డిసెంబర్‌లో కుడి కాలువకు నీరువదిలేందుకు స్టాఫ్ లాగ్ గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తే, గేటు లేవని పరిస్థితి నెలకొందన్నారు.


రిజర్వాయర్ నిండుగా ఉన్నా, సకాలంలో నీరందక రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు మంత్రి. వైజాగ్, పోలవరం నుంచి ట్రబుల్ షూటర్ పరశురామిరెడ్డి వంటి నిపుణులను తీసుకొచ్చినా స్టాప్ లాగ్ గేటు ఎత్తలేకపోయారని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి, మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరందించామని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రూ.2.54 కోట్లతో రాళ్ళపాడు గేట్ల మరమ్మత్తులు, కాలువ పనులు చేసి ఆయకట్టు రైతులకు సకాలంలో సాగు నీరందిస్తోందన్నారు. కందుకూరు నియోజకవర్గంలో చిన్న నీటి పారుదల చెరువులు, కాలువల అభివృద్ధి కోసం రూ.10.86 కోట్లతో మొత్తం 190 పనులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 11:44 AM