Share News

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 10:23 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గంజాయి నియంత్రణపై ఎమ్మెల్యే జయకృష్ణ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
AP Assembly Session

అమరావతి, ఫిబ్రవరి 17: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) నాలుగవ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దులో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానమిస్తూ... ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కిపాదం మోపినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని హోంమంతి ఆరోపించారు.


కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా, సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 35 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు. గంజాయి సాగు, రవాణాపై నిరంతర నిఘా పెట్టామన్నారు. 47 ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా నిఘా చేసి, అక్రమ సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నామని వివరించారు. గంజాయి తరలించే వారిపై 1,400కు పైగా కేసులు నమోదు చేశామని మంత్రి తెలిపారు. గంజాయి వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.


గంట ఆలస్యంగా..

ఏపీ అసెంబ్లీ ఆడియో సమస్య కారణంగా సమావేశాలు గంట ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. బడ్జెట్ రోజు సమస్య తలెత్తడంతో ఆ రోజు సరి చేశారు అధికారులు. అయితే, మళ్ళీ అదే సమస్య తలెత్తడంతో అసెంబ్లీ సాంకేతిక సిబ్బంది సరి చేసే ప్రయత్నం చేశారు. గంట సమయం పడుతుందని స్పీకర్ కార్యాలయానికి సిబ్బంది తెలియజేశారు. దీంతో సభను గంట పాటు వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

మేయర్‌గా ఆటో డ్రైవర్‌

రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 10:45 AM