Share News

మేయర్‌గా ఆటో డ్రైవర్‌

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:41 AM

వందేళ్ల చరిత్ర గల సీపీఐ.. తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఇటీవలే ఖమ్మంలో ఘనంగా లక్షల మందితో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సీపీఐని..

మేయర్‌గా ఆటో డ్రైవర్‌

  • కొత్తగూడెంలో సీపీఐ చరిత్ర!

  • తెలంగాణలో తొలిసారి మేయర్‌గా సీపీఐ నేత

  • కొత్తగూడెం కార్పొరేషన్‌ ప్రథమ పౌరుడిగా గణేశ్‌

  • వందేళ్ల సీపీఐ చరిత్రలో అరుదైన రికార్డు

  • ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ మేయర్లుగా నలుగురు సీపీఐ నేతల ప్రాతినిథ్యం

హైదరాబాద్‌/ కొత్తగూడెం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): వందేళ్ల చరిత్ర గల సీపీఐ.. తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఇటీవలే ఖమ్మంలో ఘనంగా లక్షల మందితో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సీపీఐని.. ఇటీవల కొత్తగా ఏర్పాటైన కొత్తగూడం మేయర్‌ పదవి వరించింది. తొలి మేయర్‌గా పీఠమెక్కిన సీపీఐ నేత మూడ్‌ గణేశ్‌ (33) అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశారు. కుటుంబ జీవనం కోసం ఆటో డ్రైవర్‌గా పని చేసిన మూడ్‌ గణేశ్‌ సొంతూరు సుజాతనగర్‌ మండలం కోమటిపల్లి. వందేళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న సీపీఐ నేతగా మేయర్‌గా ఎన్నికైన అరుదైన అవకాశం మూడ్‌ గణేశ్‌కే దక్కింది. తెలంగాణలో సీపీఐ నేత నగర ‘ప్రథమ పౌరుడి’గా ఎన్నిక కావడం ప్రథమమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ మేయర్లుగా నలుగురు సీపీఐ నేతలు సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక నగర పాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన వారిలో మూడ్‌ గణేశ్‌ ఐదోవారు.. తెలంగాణలో తొలి నేత. 2019లో సొంతూళ్లో బీఆర్‌ఎస్‌ తరపున ఎంపీటీసీగా ఎన్నికైన గణేశ్‌ 2023లో సీపీఐలో చేరారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో 20వ డివిజన్‌ నుంచి ఆయన ఎన్నికయ్యారు. కొత్తగూడెం మేయర్‌ పదవిని ఎస్టీలకు రిజర్వు చేశారు. సీపీఐ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు ఎన్నికైనా గణేశ్‌ను మేయర్‌ పదవి వరించడం విశేషం. ఆయనకు భార్య సింధు, కొడుకు సాత్విక్‌ ఉన్నారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో నగర పాలక సంస్థగా అవతరించిన విజయవాడలో తొలిసారి ఎన్నికలు జరిగిన 1981 నుంచి 1986 వరకూ ముగ్గురు సీపీఐ పీ.వెంకటేశ్వరరావు, అయితా రాములు, లంకా గోవిందరాజు మేయర్లుగా పని చేయగా, 1992లో రెండోసారి పీ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. తిరిగి 2005లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం కూటమిగా పోటీ చేసినప్పుడు ఏడాది పాటు సీపీఐ నేత తాటి శకుంతల మేయర్‌గా పని చేశారు.


మిత్ర ధర్మంతో సహకరించిన కాంగ్రెస్‌: సీపీఐ

కొత్తగూడెం మేయర్‌ ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ సహకరించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన మేయర్‌ ఎన్నికకు మిత్ర ధర్మంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సహకరించారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2022లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి గతేడాది పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన కూనంనేని.. ఇటీవలే ఖమ్మం వేదికగా సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తాజాగా కొత్తగూడెం మేయర్‌గా సీపీఐ నేత మూడ్‌ గణేశ్‌ ఎన్నికలోనూ కీలక పాత్ర పోషించారు.

ప్రమాణ స్వీకారానికి బీఆర్‌ఎస్‌ దూరం

ఈ నెల 11న జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎన్నికైన 8 మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. కార్పొరేషన్‌లో 60 డివిజన్లలో కాంగ్రెస్‌, సీపీఐ చెరో 22, బీఆర్‌ఎస్‌ 8, ఆరుగురు స్వతంత్రులు, బీజేపీ, సీపీఎం ఒక్కో డివిజన్‌ గెలుచుకున్నాయి. ఫలితాలు వెలువడగానే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌ చేసి.. మేయర్‌ ఎన్నికలో పూర్తి మద్దతునిస్తామని చెప్పారు. కానీ, రాష్ట్ర స్థాయిలో మిత్ర ధర్మాన్ని పాటించాలని కాంగ్రెస్‌, సీపీఐ నిర్ణయానికి రావడంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో అవసరం లేకపోయింది. ఇదిలా ఉంటే, 8 మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు.

Updated Date - Feb 17 , 2026 | 06:47 AM