టెక్నాలజీ అనుసంధానంతో సుపరిపాలన
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:24 AM
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ...
సులభంగా పౌర సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఆర్టీజీఎ్‌సపై సమీక్షలో చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, ఆ లక్ష్యంతోనే అడుగులు వేస్తామని పేర్కొన్నారు. పాలన ప్రక్రియలు, నిబంధనలు మరింత సరళం చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలనూ సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గమర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలని, ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక కూడా చెల్లింపులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకూడదన్నారు. ప్రభుత్వంలోని 8.20 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు విధులను సమర్థంగా నిర్వహించేలా సామర్థ్యాలను పెంచుకునే శిక్షణ పొందాలన్నారు. పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాలను అన్ని పథకాలు, కార్యక్రమాల్లో అనుసరించాలని అధికారులకు సీఎం సూచించారు. దీనివల్ల ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం కలుగుతుందన్నారు.
మరింత రుచిగా అన్నా క్యాంటీన్ల ఆహారం
అన్నా క్యాంటీన్లలో వడ్డించే ఆహారం మరింత రుచికరంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో భోజనాలు మరింత మెరుగుపరచాలని చెప్పారు. అన్ని వసతి గృహాల్లోనూ అత్యుత్తమ ప్రమాణాలతో ఆహారం అందేలా చూడాలన్నారు. మహిళలపై నేరాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని హోం శాఖకు సూచించారు.
ప్రజెంటేషన్ భేష్
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌పై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్‌సెప్షన్, ఏజెంట్ స్పేస్ ఏపీఏఐ సెర్చ్‌బార్, సంజీవని, అమరావతి ప్రాజెక్టులపై చూపిన ప్రజెంటేషన్స్ బిల్ గేట్స్‌ను ఆకట్టుకున్నాయని చంద్రబాబు సంతోషంగా చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News