డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ..
ABN , Publish Date - May 29 , 2026 | 12:27 PM
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డుల రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో ఆరు ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డుల రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో ఆరు ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లోగా 107 మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్లాంట్ల ద్వారా ప్రతి రోజూ 5,385 టన్నుల చెత్తను కంపోస్ట్, బయోగ్యాస్‌గా మారుస్తామని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పర్యటించారు. కొండపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్‌ను పరిశీలించగా, ఇబ్రహీంపట్నంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రజల నుంచి గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసింది. అయినా 150 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయింది. ఆ చెత్తను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగిస్తున్నాం. వచ్చే నెలాఖరు నాటికి అన్ని ప్లాంట్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం.
ఐదు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల కోసం ఏపీ ప్రభుత్వం రూ.59.85 కోట్లు మంజూరు చేసింది. రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు, ఇబ్రహీంపట్నంలో నూతన సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడలో ఉన్న ప్లాంట్‌ను కూటమి ప్రభుత్వం రూ.9.45 కోట్లతో ఉన్నతీకరిస్తోంది. మొత్తం ఐదు ప్లాంట్ల ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 125 టన్నులు. ప్రతి యూనిట్‌ను రోజుకు 25 టన్నుల సామర్థ్యంతో రూపకల్పన చేశాం. ఒక్కో నూతన ప్లాంట్‌కు రూ.12.60 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందుకు కేంద్రం, రాష్ట్రం, పట్టణ స్థానిక సంస్థలు, ప్రైవేట్ డెవలపర్లు నిధులు సమకూర్చనున్నారు.
పురపాలక వ్యర్థాలను స్వచ్ఛమైన శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. పట్టణ వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తాం. సుస్థిర వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి దిశగా కీలక అడుగు వేశాం. డంపింగ్ యార్డుల భారాన్ని తగ్గించేందుకు సీబీజీ ప్లాంట్లు దోహదపడతాయి. పట్టణ ఇంధన భద్రతను బలోపేతం చేసే ప్రాజెక్టుగా సీబీజీ ప్లాంట్లు ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక పర్యావరణ, ఆర్థిక సుస్థిరతకు ఈ ప్రాజెక్ట్ భరోసా ఇస్తుంది. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. వ్యర్థాల నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ విధానం’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ అధికారం అండతో పీఏ దోపిడీ పర్వం
శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం.. స్పర్శ దర్శనాల నిలుపుదల