Share News

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Feb 14 , 2026 | 09:56 AM

ఏపీ మద్యం కుంభకోణంలో సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు పంపే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
AP Liquor Scam

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ లిక్కర్ షాపులకు మద్యం సరఫరా చేసే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. విజిలెన్స్ అధికారుల విచారణ అనంతరం ఈనెల 10న కేసు నమోదు చేసింది సీఐడీ. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ బాధ్యతలను సిట్ చీఫ్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబుకు అప్పగించింది. సుమారు రూ.200 నుంచి రూ.400 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం.


2019-2024 మధ్య కాలంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేసి, భారీగా ముడుపులు వసూలు చేసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. రాజ్ కసిరెడ్డిని 'స్కామ్ ఆర్కిటెక్ట్'గా పేర్కొంటూ.. ఈ భారీ కుంభకోణంలో అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో సుమారు రూ.3,500 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అక్రమ మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బును విదేశీ వెంచర్లలో పెట్టుబడి పెట్టినట్లు, పలువురు నిందితులు విదేశాలకు పారిపోయినట్లు సిట్ విచారణలో తేలింది.


ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో పలువురు కీలక వ్యక్తులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ కాగా.. మరో 9 మంది విదేశాల్లో తలదాచుకున్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి.


ఇవీ చదవండి:

సిమెంట్‌ స్కామ్‌లో ‘భారతి’

దొంగ సొమ్ము దోపిడీ

Updated Date - Feb 14 , 2026 | 10:04 AM