Share News

సిమెంట్‌ స్కామ్‌లో ‘భారతి’

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:17 AM

పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్‌ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌కు అర్హతకు మించి ఆర్డర్లు ఇచ్చిన వైనం ఇప్పుడు బయటపడింది....

సిమెంట్‌ స్కామ్‌లో ‘భారతి’

  • పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం

  • నాడు సిమెంట్‌ కొనుగోళ్లలో ‘భారతీ’కి పెద్దపీట

  • అర్హతకు మించి 3 రెట్లు కొనుగోలు

  • భారతీ సిమెంట్స్‌కు రూ.165 కోట్లు చెల్లింపులు

  • అదనంగా రూ.110 కోట్లు బిజినెస్‌

  • జగన్‌ కుటుంబానికి అయాచిత లబ్ధి

  • పైగా టన్ను ధరపై అధికంగా రూ.60 చెల్లింపు

  • ‘భారతి’ కంటే ఎక్కువ ప్లాంట్‌ సామర్థ్యం ఉన్న కంపెనీలకు తక్కువ ఆర్డర్లు

  • ఆలస్యంగా వెలుగులోకి విజిలెన్స్‌ నివేదిక

  • బంధుప్రీతి, రాజకీయ కుట్ర ఉన్నట్టు వెల్లడి

  • అధికారం వాళ్లదే! ‘మీడియా’ వాళ్లదే! ఇంకేముందీ... ప్రభుత్వ ప్రకటనల రూపంలో వందల కోట్లు ‘సంపాదించారు’!

  • అధికారం వాళ్లదే! సిమెంట్‌ కంపెనీ కూడా వాళ్లదే! ఎదురేముందీ... లెక్కకు మిక్కిలి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్‌ పెంచుకున్నారు!

  • ‘సొంత లాభం కొంత మానుకో’ అనేది గురజాడ వారి మాట! ‘సొంత లాభమే బాగా చూసుకో’ అనేది ఐదేళ్ల పాలనలో జగన్‌ నడిచిన బాట!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్‌ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌కు అర్హతకు మించి ఆర్డర్లు ఇచ్చిన వైనం ఇప్పుడు బయటపడింది. దామాషా పద్ధతిన భారతీ సిమెంట్స్‌ నుంచి కొనాల్సిన దానికంటే మూడు రెట్లు అదనంగా కొనుగోలు చేశారు. నాడు అధికారంలో ఉన్న జగన్‌... ఆ మేరకు తన కుటుంబ వ్యాపారాన్ని పెంచుకున్నారు. దీనికోసం ఇతర సిమెంట్‌ కంపెనీల ఆర్డర్లకు గండి కొట్టారు. ఈ అక్రమ వ్యవహారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో వెలుగు చూసింది. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీ సిమెంట్స్‌ నుంచి పరిమితికి మించి ఏకంగా 3,31,528 టన్నుల సిమెంట్‌ కొనుగోలు చేశారు. ఇందుకోసం జగన్‌ కుటుంబానికి రూ.165 కోట్లు చెల్లించారు. అంటే.. రూ.55 కోట్ల విలువైన సిమెంట్‌ కొనుగోలు చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.110 కోట్ల విలువైన సిమెంట్‌ అదనంగా తీసుకున్నారు. అప్పటి రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు వైసీపీ పెద్దలతో కుమ్మక్కయినట్టు విజిలెన్స్‌ విభాగం తేల్చింది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని తెరమీదకు తెచ్చినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. లబ్ధిదారులకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా లక్షలాది పక్కా ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్‌తో పాటు ఇనుము, ఇతర మెటీరియల్స్‌ను ఒకేసారి కొనుగోలు చేసి రూ.వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. గత ప్రభుత్వ పెద్దలకు కావలసినవారి సిమెంట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసం భారీస్థాయిలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం వెనుక బంధుప్రీతి, రాజకీయ కుట్ర ఉన్నట్లుగా పరిగణించవచ్చని విజిలెన్స్‌ విభాగం నివేదికలో వెల్లడించింది.


ఆప్షన్‌-3 ఆలోచనలోనే కుట్ర

బలహీనవర్గాలకు పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా సబ్సిడీ నిధులు విడుదల చేస్తుంటే.. లబ్ధిదారులు సొంతంగానే తమ ఇళ్లు పూర్తి చేసుకునేవారు. కానీ 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల గృహనిర్మాణ పథకం పూర్తిగా పక్కదారి పట్టింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రాయితీ నిధులతో పక్కా ఇళ్లు కట్టుకోలేని పేదలకు ఆప్షన్‌-3 కింద రాష్ట్ర ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇస్తుందని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3.51 లక్షల మంది లబ్ధిదారులు తమ సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ఆప్షన్‌-3ని ఎంపిక చేసుకున్నారు. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని నమ్మేశారు. జగన్‌ ప్రకటించిన ఆప్షన్‌-3 వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఎవరూ ఊహించలేకపోయారు. జగన్‌ ప్రభుత్వం ముందస్తు పథకం ప్రకారం.. ఆప్షన్‌-3 ఎంపిక చేసుకున్న పేదల ఇళ్లను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా కట్టించకుండా నిర్మాణ రంగంలో కనీస పరిజ్ఞానం, అనుభవం, అర్హతలు లేని వైసీపీ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. టెండర్లు, అగ్రిమెంట్లు, పూచీకత్తుల వంటివి ఏమీ లేకుండానే ఒక్కొక్కరికి రూ.వందలు, వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఇళ్ల పనులు మొదలు పెట్టకుండానే కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ కింద వచ్చిన రూ. వేల కోట్ల నిధులను హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా కాంట్రాక్టర్లకు అడ్వాన్సుల కింద ఎడాపెడా దోచిపెట్టారు. నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి ఈ దోపిడీలో భాగస్వాములైన హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు.. పనిలోపనిగా నాటి ముఖ్యమంత్రి జగన్‌ సతీమణికి కూడా అవినీతిలో భారీగా వాటా కల్పించారు. ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణానికి వినియోగించే సిమెంట్‌, స్టీలు, ఇతర నిర్మాణ సామగ్రిని నిబంధనలకు విరుద్ధంగా సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో సేకరించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. వెంటనే తమ ప్రణాళికను చకచకా అమలు చేసేశారు.


ఇతర కంపెనీలకు అన్యాయం

భారతీ సిమెంట్స్‌ కన్నా ఎక్కువ ప్లాంట్‌ సామర్థ్యం అర్హత ఉన్న అలా్ట్ర టెక్‌, రామ్‌కో, మై హోం, పెన్నా, సాగర్‌, జువారీ కంపెనీలతో పాటు కేసీపీ, జేఎ్‌సడబ్ల్యూ, రెయిన్‌, పరాశక్తి, భవ్య, ఎన్‌సీఎల్‌, శ్రీచక్ర, శ్రీజయ జ్యోతి సిమెంట్‌ ప్రైవేట్‌ కంపెనీలకు మాత్రం వాటి ప్లాంట్‌ సామర్థ్యాల కంటే తక్కువ కొనుగోళ్లు ఆర్డర్లు ఇచ్చారు. మొత్తంగా 18 సిమెంట్‌ కంపెనీలకు రూ.1143.11 కోట్లు చెల్లించారు. ఇలా సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో సేకరించిన 22,64,855 టన్నుల సిమెంట్‌ను అన్ని జిల్లాల్లో గోదాముల్లో నిల్వ చేశారు.

ధరలోనూ అదనంగా చెల్లింపు

పేదల ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం 18 సిమెంట్‌ తయారీ కంపెనీల నుంచి మొత్తం 22,64,855 టన్నుల సిమెంట్‌ను కొనుగోలు చేశారు. ఆయా సిమెంట్‌ తయారీ కంపెనీల ప్లాంట్‌ సామర్థ్యాలను బట్టి దామాషా ప్రకారం సిమెంట్‌ను కోనుగోలు చేయాల్సి ఉంది. కానీ 2020లో నాటి ముఖ్యమంత్రి జగన్‌ మెప్పు కోసం ఆయన కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌ ప్లాంట్‌ సామర్థ్యం అర్హతకు మించి 3 రెట్లు ఎక్కువ బిజినెస్‌ ఇచ్చారు. దాదాపు లక్షా 10 వేల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఏకంగా 3,31,528 టన్నుల సిమెంట్‌ కొన్నారు. ఇందుకుగాను రూ.165.58 కోట్ల ప్రభుత్వ ధనాన్ని భారతీ సిమెంట్స్‌కు చెల్లించారు. కాగా ధర కూడా ముందుగా నిర్ణయించిన దానికంటే అధికంగా చెల్లించారు. మొదట బస్తా ధరను పీపీసీ రకానికి రూ.225, ఓపీసీ రకానికి రూ.235గా నిర్ణయించారు. అయితే బస్తాపై రూ.3 ఎక్కువగా టన్నుకు రూ.60 అదనంగా చెల్లించారు. భారతీ సిమెంట్స్‌ తర్వాత ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌, చెట్టినాడ్‌, దాల్మియా కంపెనీలకు వాటి ప్లాంట్ల సామర్థ్యానికి మించి 2 రెట్లు ఎక్కువగా సిమెంట్‌ కొనుగోలు చేశారు.

Updated Date - Feb 14 , 2026 | 03:17 AM