దొంగ సొమ్ము దోపిడీ
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:11 AM
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో నిందితులు దాచిన దొంగ సొమ్మునే కొందరు దొంగతనం చేశారు. ఆ సొమ్ముతో ఒడిశా, హైదరాబాద్‌లో స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారు.
లిక్కర్ స్కామ్ నిందితుల ఇంట్లో డబ్బు కొట్టేసి ఆస్తుల కొనుగోలు
హైదరాబాద్, ఒడిశాలో స్థిర, చరాస్తులు ..అటాచ్ చేసిన సిట్
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో నిందితులు దాచిన దొంగ సొమ్మునే కొందరు దొంగతనం చేశారు. ఆ సొమ్ముతో ఒడిశా, హైదరాబాద్‌లో స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కామ్‌పై విచారణ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఆస్తులను అటాచ్ చేస్తూ హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ కమీషన్లను హైదరాబాద్‌లో ఏ-44 కొల్లిపూరి మోహన్‌కుమార్ నివాసంలో భద్రపరిచారు. ఆ ఇంటిని కలెక్షన్ నగదు పాయింట్‌గా వినియోగించారు. 2024లో అక్కడ పనిచేసే రస్మితా బూరా అనే మహిళ(సాక్షి) ఇంట్లోని నగదు పెట్టెలను చూసింది. వాటిని దొంగతనం చేసేందుకు ప్లాన్‌చేసి ఇర్షాద్ అహ్మద్(మరో సాక్షి)కి సమాచారం ఇచ్చింది. అతను కటక్ నుంచి కొందరు వ్యక్తులను, హైదరాబాద్‌కు చెందిన ముబారక్ అలీ(మరో సాక్షి)ని పిలిపించి మొత్తం ఆరు పెట్టెలను దొంగతనం చేశారు. ఆ డబ్బులో రస్మితా బూరాకు రూ.30 లక్షలు వాటా దక్కింది. ఆమె బంగారం కొనుగోలు, ఇతర అవసరాలకు ఆ డబ్బు వాడుకుంది. కొనుగోలు చేసిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టింది. ఇర్షాద్ అహ్మద్ ఒడిశాలో కటక్- పారాదీప్ రోడ్డులోని గాటిరావుపట్నాలో నాలుగు ప్లాట్లు కొనుగోలు చేశాడు. ముబారక్ అలీ హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతంలోని హకీంపేటలో 178 చదరపు గజాల్లో ఉన్న రెండు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడు.