Share News

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పునరుద్ధరణ పనులు: మంత్రి నారాయణ

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:06 PM

రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పట్టణాల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తుఫాను అనంతర పరిస్థితులపై మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ అధికారులతో ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పునరుద్ధరణ పనులు: మంత్రి నారాయణ
Andhra Pradesh Cyclone

అమరావతి,అక్టోబర్ట్ 29: రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పట్టణాల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తుఫాను అనంతర పరిస్థితులపై మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ అధికారులతో ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈసీ ప్రభాకర్ సహా పలువురు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల పరిధిలోని 10 మున్సిపాలిటీల్లోని 85 ప్రాంతాలు తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. అయితే, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించి ఇప్పటివరకు ఏడు మున్సిపాలిటీల పరిధిలోని 71 ప్రాంతాల్లో జనజీవనాన్ని పూర్తిగా సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు తెలిపారు.


రోడ్లపై అడ్డంగా పడిన చెట్లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాలను ఇప్పటికే పూర్తిగా తొలగించి రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు.


ఈ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ గట్టిగా ఆదేశించారు. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని సూచించారు. అలాగే ఇవాళ వీధి దీపాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Updated Date - Oct 29 , 2026 | 03:10 PM