ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
ABN , Publish Date - Oct 29 , 2026 | 02:48 PM
ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ పనితీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకుందని వ్యాఖ్యానించింది.
ఢిల్లీ: ఎన్సీఎల్టీ (National Company Law Tribunal), ఎన్సీఎల్ఏటీ (National Company Law Appellate Tribunal) పనితీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తిగా హైజాక్ చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రైబ్యునళ్ల స్వయంప్రతిపత్తిపై ప్రశ్నలు సంధిస్తూ, కాంట్రాక్టు నియామకాలతో జ్యుడీషియల్ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా కాంట్రాక్టు నియామకాలను తక్షణమే నిలిపివేయాలని సూచించారు.
యూపీఎస్సీ (UPSC), ఎస్ఎస్సీ (SSC) ద్వారా పారదర్శకంగా, క్రమబద్ధమైన నియామకాలు చేపట్టాలని సీజేఐ సూచించారు. ట్రైబ్యునళ్ల అధ్యక్షులకే నియామకాల విషయంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఉండాలని స్పష్టం చేశారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రైబ్యునళ్లను తన ఆధీనంలో ఉంచుకోవాలని చూడటం శోచనీయమని సీజేఐ ధర్మాసనం మండిపడింది. తాత్కాలిక ఉపశమనంగా ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకోవాలని సూచించింది. గతంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఒరిజినల్ రికార్డులతో పారిపోయిన ఘటనలనూ ధర్మాసనం గుర్తుచేసింది. మరోవైపు, ఆరేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని రాత్రికి రాత్రే తొలగించవద్దని న్యాయస్థానానికి సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోరా విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
క్యాన్సర్ మందుల ధరలకు బ్రేక్ పడలేదా? సుప్రీంకోర్టు ఆదేశించినా మారని 37 ఔషధాల ధరలు!
నీట్ పేపర్ లీకేజీ కేసు.. 14 మంది నిందితులపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు!