తుళ్లూరులో శివాలయ శంకుస్థాపన మహోత్సవం.. మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:49 PM
ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో శివాలయం శంకుస్థాపన మహోత్సవానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ సహకారంతో వందల ఏళ్లనాటి ఆలయాన్ని గ్రామస్థులు తిరిగి నిర్మిస్తున్నారు.
అమరావతి, ఆగస్టు 21: ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో శివాలయం శంకుస్థాపన(పునః) మహోత్సవానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ సహకారంతో వందల ఏళ్లనాటి ఆలయాన్ని గ్రామస్థులు తిరిగి నిర్మిస్తున్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ బాల కోటేశ్వర స్వామివార్ల ఆలయ నిర్మాణానికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తుళ్లూరు శివాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. రాజధాని ల్యాండ్ పూలింగ్‌లో తుళ్లూరు రైతులు ఎంతగానో సహకరించారని తెలిపారు. రాజధాని రైతుల కుటుంబంలో తానూ ఒకడిగా ఉండి పూలింగ్ చేశానని చెప్పుకొచ్చారు.
రైతుల త్యాగాలతో తిరిగి అమరావతి రాజధాని అయిందని మంత్రి అన్నారు. ఇదే ఆలయం నుంచి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ప్రారంభించి విజయం సాధించారని చెప్పుకొచ్చారు. నాటి ప్రభుత్వంలో రైతులు, మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ఫ్లాట్‌లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల వారీగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం స్పోర్ట్స్ సిటీ, రైల్వే వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్‌పై దృష్టి సారించినట్లు తెలిపారు.15 రోజుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవే కి కలిపే మూడో విడత నిర్మాణ పనులు(ఎలివేటెడ్ కారిడార్) ప్రారంభిస్తామన్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలందరికీ మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు
వరలక్ష్మీ వ్రతం.. దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
Read Latest AP News And Telugu News