దేశ క్వాంటం టెక్నాలజీ ప్రస్థానంలో ఏపీ సరికొత్త చరిత్ర
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:50 PM
అమరావతి క్వాంటం వ్యాలీలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. -269°C అత్యంత శీతల వాతావరణాన్ని సృష్టించి.. క్వాంటం అప్లికేషన్ల తయారీలో దేశంలోనే సరికొత్త మైలురాయిని అమరావతి అధిగమించింది.
అమరావతి, జూన్ 19: దేశ క్వాంటం టెక్నాలజీ ప్రస్థానంలో ఏపీ సరికొత్త చరిత్రను సృష్టించింది. అమరావతి క్వాంటం వ్యాలీలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. -269°C అత్యంత శీతల వాతావరణాన్ని సృష్టించి.. క్వాంటం అప్లికేషన్ల తయారీలో దేశంలోనే సరికొత్త మైలురాయిని అమరావతి అధిగమించింది. క్వాంటం టెక్నాలజీ రంగంలో అమరావతి క్వాంటం వ్యాలీ రికార్డులు సృష్టిస్తోంది. అత్యంత శీతల ఉష్ణోగ్రతలు 4 కెల్విన్ (-269°C)ను మేధా టవర్స్‌లోని క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీని ఏపీ సాధించింది.
క్వాంటమ్ కంప్యూటర్లు పని చేయడానికి అవసరమైన అత్యంత చల్లటి వాతావరణాన్ని సృష్టించే ప్రత్యేక పరికరం డైల్యూషన్ రిఫ్రిజిరేటర్. ఇకపై ఈ టెక్నాలజీ కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితికి అమరావతి క్వాంటం వ్యాలీ ఫుల్‌స్టాప్ పెట్టింది. క్వాంటం హార్డ్‌వేర్ టెస్టింగ్‌లో భారత్‌కే తలమానికంగా అమరావతి ఫెసిలిటీ సెంటర్ మారింది. క్వాంటం చిప్స్, సూపర్‌కండక్టింగ్ పరికరాలు, క్వాంటం సెన్సార్లు, క్వాంటం కమ్యూనికేషన్ పరికరాలు, క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్ వంటి అత్యాధునిక పరికరాలను పరీక్షించే అవకాశం ఉంది.
గత ఏడాది సెప్టెంబర్‌లో మేథా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్శిటిల్లో క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించారు. Qbit Force, Qubitech సంస్థల ఆధ్వర్యంలో కేవలం ఏడాది కాలంలోనే క్రయోజెనిక్ సాంకేతికతలో అద్భుత ప్రగతి సాధించారు. ఇకపై భారతదేశ క్వాంటం రంగంలో అమరావతి కీలకం కానుంది. 85శాతానికి పైగా క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను స్థానికంగానే తయారు చేసేందుకు మార్గం సుగమమైంది. స్టార్టప్‌లు, జాతీయ ల్యాబ్‌లు, పరిశోధకులకు ఇకపై అమరావతి కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి...
‘ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం
మలేషియా మోడల్‌పై ఏపీ ఫోకస్.. బుకిత్ తగర్‌లో నారాయణ పర్యటన
Read Latest AP News And Telugu News