NTR Statue Amaravati: అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం.. డిజైన్ల పరిశీలన..
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:12 PM
రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలో కొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహంతోపాటు స్మృతివనం ఇతర డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని సర్కార్ ఏర్పాటు చేసింది.
అమరావతి, జనవరి 8: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) భారీ విగ్రహం (NTR Statue Amaravati), స్మృతివనం ఏర్పాటుకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు (గురువారం) సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ఏర్పాటు చేసిన వివిధ నమూనా డిజైన్లను మంత్రులు పరిశీలించారు. విగ్రహంతో పాటు స్మృతివనం ఇతర డిజైన్లనూ ఫైనలైజ్ చేసేందుకు ఈ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలో కొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విగ్రహం సుమారు 3500 టన్నుల కంచు (BRONZE)తో తయారు చేయనున్నారు. విగ్రహాలకు సంబంధించి ప్రాజెక్టు నివేదిక (DPR), ప్రాజెక్టు పరిధిని మంత్రి వర్గ ఉపసంఘం సమీక్షించింది. నమూనా విగ్రహం కొలతలు, భంగిమతో సహా విగ్రహ వివరాలపై తుది నిర్ధారణ చేయనున్నట్లు తెలుస్తోంది. విగ్రహం ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతలను అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్)కు సర్కార్ అప్పగించింది. సబ్ కమిటీ సమావేశంలో డిజైన్లు, స్థలం, నిర్మాణ ప్రణాళికలపై వివరంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. అలాగే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) ఎండీ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. కాగా... ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతి రాజధానిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలోనే డిజైన్లు ఖరారు చేసి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
అనంత కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్
వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు లోకేష్ కీలక సూచనలు
Read Latest AP News And Telugu News