దేశంలో ఏపీని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:50 PM
దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శనివారం విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్- 2026ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
అమరావతి, అక్టోబర్ 03: దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శనివారం విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్- 2026ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించుకున్న వికసిత భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక తోడ్పాటును అందిస్తోందని అన్నారు. మరో10 ఏళ్లలో భారత్ ఉన్నత స్థాయికి వెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంవోయూలు చేయడమే కాదు.. కంపెనీలు పెడుతున్నారా? ఉద్యోగాలు ఇస్తున్నారా? అనే అంశాన్ని కూడా తాము చూస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి ప్రమోటర్‌కు సంబంధించి ఓ అప్డేట్ శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం తానే స్వయంగా పంపుతానని మంత్రి లోకేశ్ వివరించారు. అవి తమ పాలసీ ఫ్రేమ్ వర్క్ టైం కన్నా ముందున్నాయని తెలిపారు. రాష్ట్రంలో16 వేల టీచర్లను రిక్రూట్ చేశామని చెప్పారు. అయితే గతంలో ఎందుకు నోటిఫికేషన్లు ఆగాయో చెప్పమని ఏఐ ఇంజన్‌ను అడిగామన్నారు. సొల్యూషన్ వచ్చేసిందని.. ఆ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వగలిగామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 50 శాతం మంది శాసనసభ్యులు యువతేనని గుర్తు చేశారు. చంద్రబాబు కేబినెట్‌లో 17 మంది మంత్రులు కొత్త వారేనని ఈ సందర్భంగా నారా లోకేశ్ చెప్పారు.
రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని మంత్రి ప్రకటించారు. ఏపీలో డేటా సెంటర్ ఎకో సిస్టంను వైజాగ్‌లో పెట్టామని వివరించారు. మొదట గూగుల్‌తో మాట్లాడామని.. ఇక్కడకు రావాలంటే వారు ఇక్కడి కాంప్లెక్స్ పన్నుల గురించి వివరించారని తెలిపారు. వెంటనే తాము కేంద్రంతో మాట్లాడి.. వారిని రాష్ట్రానికి ఆహ్వానించామని అన్నారు. నమో అంటే నారా చంద్రబాబు నాయుడు, మోదీజీ జోడీ అని భావించాలని పేర్కొన్నారు. క్వాంటం రంగంలో ఇండియా గర్వపడేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే తాము పెట్టుబడులు ఆకర్షించడానికి లేమని.. పరిశ్రమలకు కొత్త అర్ధాన్ని చెప్పడానికి ఉన్నామని పేర్కొన్నారు.
ఈ ప్రయాణంలో కలిసి నడవాలని ఈ సందర్భంగా ఐఐటియన్లను తాను కోరుతున్నానని లోకేశ్ అన్నారు. విజిబిల్ గవర్నెన్స్ అండ్ ఇన్విజిబుల్ గవర్నెన్స్ ఏఐ ద్వారా సాధ్యమతుందని స్పష్టం చేశారు. మనం ఇక్కడ ఏం చేసినా దానిని ఇండియా ఫాలో అవుతోందని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం ఇప్పటి వరకూ చూడని నిర్మాణాలతో జరుగుతుందని వివరించారు. వీలు చూసుకుని అమరావతిని చూడాలని వారిని కోరారు. ప్రతి 100 రోజులకు అమరావతిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
విజయవాడలో ప్రస్తుతం ఇన్ టర్మ్ ఎయిర్ పోర్ట్ మాత్రమేనని మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ తరహలోనే రాజధాని అమరావతిలో 5వేల ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ రానుందని చెప్పారు. క్వాంటం టెక్నాలజీలో ఎడ్యుకేషన్, ఆర్ ఆండ్ డీలో ఉన్న అవకాశాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని వారికి సూచించారు. ఏపీ కూడా త్వరలోనే ఎస్కేప్ వెలాసిటీ హైదరాబాద్ తరహాలో చేరుకొని అద్భుతాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని చేరుకోవాలని అనుకున్నా.. అయితే నా వాట్సాప్ అకౌంట్ స్పామ్‌లోకి వెళ్లిపోయిందని.. మరో 24 గంటల్లో దానిని నుంచి బయటకు రాగానే మీతో టచ్‌లోకి వస్తా’ అంటూ వారికి మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్
శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలుడు.. ఐదుగురికి పైగా మృతి
Read Latest AP News And Telugu News