Share News

అగ్రస్థానంలో.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం

ABN , Publish Date - Feb 09 , 2026 | 09:54 PM

రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతిపై ఏపీ ప్రభుత్వం సోమవారం అమరావతిలో నివేదిక విడుదల చేసింది. మొదటి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నిలిచింది.

అగ్రస్థానంలో.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం

అమ‌రావ‌తి, ఫిబ్రవరి 09: రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతిపై ఏపీ ప్రభుత్వం సోమవారం అమరావతిలో నివేదిక విడుదల చేసింది. మొదటి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నిలిచింది. రెండో స్థానంలో గాజువాక, మూడో స్థానంలో కాకినాడ సిటీ, నాలుగో స్థానంలో విజయవాడ ఈస్ట్ నిలిచాయి. ఐదో స్థానంలో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నిలిచింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం 10వ స్థానంలో ఉంది. వివిధ అంశాల ఆధారంగా ఈ 175 నియోజకవర్గాలకు ర్యాంకులు కేటాయించింది.


వివిధ ఇండికేటర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది. ఇక మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల్లో ఏ ప్లస్ గ్రేడ్‌లో 21 ఉన్నాయి. అలాగే ఏ గ్రేడ్‌లో 153, బి గ్రేడ్‌లో ఒక నియోజ‌కవ‌ర్గం ఉంది. 90 శాతానికి పైగా మార్కుల సాధించి ఏ ప్లస్ గ్రేడ్‌ను 13 నియోజ‌క‌వ‌ర్గాలు దక్కించుకున్నాయి. 93 శాతం మార్కులు సాధించిన రాష్ట్రంలోనే నంబ‌ర్ వన్ నియోజ‌కవ‌ర్గంగా ఎన్టీఆర్ జిల్లాలోని విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌కవ‌ర్గం అగ్రస్థానంలో నిలిచింది.


విజయవాడ పశ్చిమ(వెస్ట్) నియోజకవర్గం నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మిషన్ వెస్ట్ పేరుతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా గడప గడపకూ సుజనా వంటి కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడంలో ఆయన చూపిన చొరవ ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాయి. ఈ ర్యాంకింగ్‌లో కీలకమైన మార్కులు అవే తెచ్చిపెట్టాయి.

Updated Date - Feb 09 , 2026 | 10:08 PM