కొండపై కర్ణాటక సత్రాల వివాదం
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:55 AM
తిరుమలలోని కర్ణాటక సత్రాల నిర్వహణ బాధ్యతలను ఆ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్పొరేషన్(కేఎస్‌టీడీసీ) తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది.
కన్నడ పర్యాటక శాఖకు అప్పగింత
మండిపడుతున్న రాష్ట్ర నేతలు
సీఎం డీకే పెత్తనం సాగదని వెల్లడి
తిరుమల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని కర్ణాటక సత్రాల నిర్వహణ బాధ్యతలను ఆ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్పొరేషన్(కేఎస్‌టీడీసీ) తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటివరకు ఏపీ దేవదాయశాఖ పరిధిలో ఉన్న కర్ణాటక ప్రవాస సౌధ భవనాలను ఇకపై కేఎ్‌సటీడీసీ నిర్వహిస్తుందని ఇటీవల ఆ శాఖ ఎండీ శివప్రసాద్ తిరుమలలో ప్రకటించారు. తిరుమలలోని వివిధ మఠాలతో పాటు కర్ణాటక సత్రాల నుంచి కూడా రోజూ శ్రీవారికి సమర్పిస్తున్న నిత్య హారతుల్లో తమ రాష్ట్ర అధికారులను, ప్రజాప్రతినిధులను పంపుతామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రకటనపై గతంలో తీవ్రస్థాయి దుమారం రేగింది. తాజాగా ఆలయం వెనుకభాగంలో సుమారు ఏడున్నర ఎకరాల స్థలంలో ఉన్న కర్ణాటక సత్రాలను దేవదాయ శాఖ నుంచి కర్ణాటక టూరిజం శాఖ తీసుకోవడం వివాదంగా మారింది. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కానీ టూరిజం కేంద్రం కాదని పలువురు నాయకులు పేర్కొంటున్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై టీటీడీ స్పందించాల్సి ఉంది. కాగా, ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆటలను సాగనివ్వబోమని తెలిపారు. ‘‘మైసూర్ మహారాజు గౌరవార్థం టీటీడీ ఇచ్చిన ఏడున్నర ఎకరాల స్థలంలో కర్ణాటక ప్రభుత్వం యాత్రికుల కోసం గదులు నిర్మించింది. అయితే, ఆ భవనాలను టూరిజం శాఖకు అప్పగించడం మంచిది కాదు. సీఎం డీకే శివకుమార్ జోక్యంతో తిరుపతికి చెందిన, కేంద్రమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు చక్రం తిప్పుతున్నారు. కర్ణాటక సత్రాల్లోని షాపులను, హోటళ్లను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలానే ముందుకెళ్లాలని ప్రయత్నిస్తే మొత్తం ఆస్తిని టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది. టీటీడీ అధికారులతో మాట్లాడి వారికి నోటీసులు పంపుతాం. కొందరికి మేలు చేయాలని శివకుమార్ తన అధికారాన్ని ఇటువంటి పనులకు ఉపయోగిస్తున్నారు’’ అని విమర్శించారు.
ప్రతిఅంగుళం శ్రీవారి ఆస్తే: కిరణ్‌రాయల్
తిరుమలలోని ప్రతి అంగుళం భూమి శ్రీవారి ఆస్తేనని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. అలాంటి తిరుమలలో కర్ణాటక సత్రాలను పర్యాటక శాఖకు ఇవ్వాలని నిర్ణయించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ప్రస్తుతం ఆయా సత్రాల్లో పనిచేస్తున్న దాదాపు 400 మంది ఉద్యోగులను కూడా తొలగించి కర్ణాటక వ్యక్తులను నియమించాలని ప్రయత్నించడం కూడా తప్పేనని అన్నా రు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా కర్ణాటక ప్రభుత్వం ముందుకెళుతుండడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!