Share News

గగనంలో గూఢచారి

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:36 AM

రెండు వరుస వైఫల్యాల తర్వాత అద్భుత విజయంతో ఇస్రో చరిత్ర సృష్టించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి భూపరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా చేపట్టిన ఈవోఎస్‌-05 ఉపగ్రహ ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయింది.

గగనంలో గూఢచారి

  • ఈవోఎస్‌-05 ప్రయోగం విజయవంతం

  • 18.45 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌17

  • 2 వరుస వైఫల్యాల తర్వాత ఇస్రో విజయం

  • భూస్థిర కక్ష్యలోకి ఈవోఎస్‌-05 శాటిలైట్‌

సూళ్లూరుపేట, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రెండు వరుస వైఫల్యాల తర్వాత అద్భుత విజయంతో ఇస్రో చరిత్ర సృష్టించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి భూపరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా చేపట్టిన ఈవోఎస్‌-05 ఉపగ్రహ ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయింది. గగనతలంలో గూఢచారిగా అభివర్ణిస్తున్న అత్యాధునిక ఉపగ్రహం ఈవోఎ్‌స-05ను తీసుకుని ఇస్రో ‘నాటీ బాయ్‌’ జీఎస్ఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహాన్ని నిర్దేశిత సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. బుధవారం రాత్రి 11.25 గంటలకు ప్రారంభమైన 27.30 గంటల కౌంట్‌డౌన్‌ ముగియగానే నింగిలోకి దూసుకుపోయింది. రాకెట్‌ తన 3దశలను సునాయాసంగా పూర్తిచేసుకుని 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 18.45 నిమిషాల్లో కక్ష్యలో విడిచిపెట్టింది. మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ జీఎస్ఎల్వీ-ఎఫ్‌17 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. సహచర శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ఇది సమష్టి విజయమని అన్నారు. ఇస్రో చరిత్రలో తొలిసారిగా జియో ఫ్లాట్‌ఫామ్‌పై ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చామన్నారు. దేశ బహుళ అవసరాల నిమిత్తం భూమిని నిశితంగా పరిశీలించేందుకు 36,000 కి.మీ. ఎత్తులోని జియోసింక్రనోస్‌ కక్ష్యలోకి భారత్‌ పంపిన తొలి భూపరిశీలన ఉపగ్రహం ఇదేనని చెప్పారు. కాగా, గతంలో ఎదురైన వైఫల్యాల తర్వాత లభించిన ఈ అద్భుత విజయం కచ్చితంగా ఇస్రో ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది.


రక్షణ, విపత్తుల నిర్వహణలో గేమ్‌చేంజర్‌

సరిహద్దుల్లో శత్రు దేశాలు సైనిక స్థావరాలను ఎంత రహస్యంగా దాచినప్పటికీ... వాటిని ఇట్టే పసిగట్టే సత్తా ఈవోఎస్‌-05 ఉపగ్రహానికి ఉంది. వరదలు, తుఫాన్లు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పాత చిత్రాలతో పోల్చుకునే పనిలేకుండా.. దాదాపు రియల్‌ టైమ్‌లో వాటి తీవ్రతను అంచనా వేయవచ్చు. పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, ఖనిజ సంపద తదితర వివరాలను హైపవర్‌, మల్టీ స్పెక్ట్రల్స్‌ కెమెరాలు సులువుగా గుర్తిస్తాయి. ఈ ఉపగ్రహం బరువు 2,367 కిలోలు. జీఎస్ఎల్వీ-ఎఫ్‌17 సాధారణ సామర్థ్యం 2,250 కిలోలు. కానీ.. ఉపగ్రహం బరువు ఎక్కువగా ఉండడంతో దీన్ని ముందుగా సబ్‌-జీటీవో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అనంతరం ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి ప్రొపల్షన్‌ వ్యవస్థ సాయంతో 31 వేల కి.మీ. నుంచి 36 వేల కి.మీ. ఎత్తులోని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి తీసుకెళ్తారు.

ఈ సారి మిస్‌ కాలేదు...

2021 ఆగస్టులో ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలమైంది. దీంతో ఈవోఎస్‌-03 ఉపగ్రహాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ఇస్రోకు అత్యంత నమ్మకమైన పీఎస్ఎల్వీ రాకెట్‌ కూడా ఇటీవల తీవ్రంగా నిరాశపరిచింది. ఈ రాకెట్‌తో 2025, 2026లో చేపట్టిన వరుస ప్రయోగాలు విఫలం కావడంతో ఇస్రో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావులేకుండా జీఎస్ఎల్వీ-ఎఫ్‌17 ద్వారా ఈవోఎస్‌-05 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్ష రంగంలో తన సత్తా ఏమిటో చాటిచెప్పింది.


గగన్‌యాన్‌ పనులు ముమ్మరం: ఇస్రో చైర్మన్‌

ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవరహిత ప్రయోగాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్‌ వి నారాయణన్‌ స్పష్టం చేశారు. జీఎస్ఎల్వీ-ఎఫ్‌17 ప్రయోగం విజయం తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఈ ప్రయోగం ద్వారా ఇస్రో తొలి విజయాన్ని నమోదు చేసిందని చెప్పారు. ఈ విజయం చరిత్రాత్మకమైనదన్నారు. దాదాపు 8 నెలల తర్వాత ఇస్రోకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో షార్‌ నుంచి మరో 6 ప్రయోగాలు ఉంటాయన్నారు. అందులో గగన్‌యాన్‌ మానవ రహిత ప్రయోగం కూడా ఉంటుందన్నారు. ఇప్పటికే షార్‌లో మిషన్‌ గగన్‌యాన్‌కు సంబందించిన పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. అక్టోబరులో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగం ఉంటుందన్నారు. షార్‌లో మూడో లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణం కీలక దశలో ఉందని చెప్పారు. కార్యక్రమంలో షార్‌ డైరెక్టర్‌ ముత్తు చెళియన్‌, శాటిలైట్‌ డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, మిషన్‌ డైరెక్టర్‌ థామన్‌ కురియన్‌, వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌ రాజీవ్‌, శాస్త్రవేత్తలు ఎంఆర్‌ రాఘవేంద్ర, దినేశ్‌ కుమార్‌ సింగ్‌, పంకజ్‌ దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇస్రో బృందానికి అభినందనలు: కాంగ్రెస్‌

ఈవోఎస్‌-05 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. భూపరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ఇస్రో బృందాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఈ విజయాన్ని అభినందిస్తూనే.. అంతరిక్ష రంగంలో మోదీ సర్కారు తీసుకొస్తున్న సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


దేశం గర్వించే క్షణం: ప్రధాని మోదీ

భారత్‌ స్వదేశీయంగా తయారు చేసిన తొలి భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికి గర్వకారణమైన క్షణమని కొనియాడారు. ‘ఇస్రో సాధించిన మరో అద్భుత విజయమిది. భారత అంతరిక్ష రంగ పనితీరు, ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు ఈ విజయం నిదర్శనం’ అని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత అంతరిక్ష రంగం అసాధారణ కొత్త శిఖరాలను అధిరోహిస్తూనే ఉందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఇస్రో విజయాన్ని కొనియాడారు.

ఈ వార్తలను కూడా చదవండి

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్

Updated Date - Sep 05 , 2026 | 04:37 AM