‘ఇంటింటికీ’ @ కోటి
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:02 AM
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం 40వ రోజు నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించింది. శుక్రవారం ఒక్కరోజే అదనంగా 1.30 లక్షల ఇళ్లను సందర్శించడంతో మొత్తం సందర్శనల సంఖ్య కోటికి చేరింది.
కోటి ఇళ్ల మైలురాయినిదాటిన కార్యక్రమం
40 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఇళ్ల సందర్శన
ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై వివరణ
సమస్యల పరిష్కారానికీ టీడీపీ శ్రేణుల కృషి
నేతలు, కార్యకర్తలకు లోకేశ్ అభినందనలు
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం 40వ రోజు నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించింది. శుక్రవారం ఒక్కరోజే అదనంగా 1.30 లక్షల ఇళ్లను సందర్శించడంతో మొత్తం సందర్శనల సంఖ్య కోటికి చేరింది. రాష్ట్రంలో మొత్తం 1,35,91,105 ఇళ్లు ఉండగా, ఇప్పటివరకు సందర్శించిన ఇళ్ల సంఖ్య 73.6 శాతానికి చేరడం విశేషం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్క దాన్ని కూడా మినహాయించకుండా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం-2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం’ పేరిట ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రోజుకు సగటున 2 లక్షలకుపైగా ఇళ్లను సందర్శించారు. ప్రభుత్వ పనితీరును వివరిస్తూనే ఆయా కుటుంబాల సమస్యలను, స్థానిక అవసరాలను, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలు, సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారాన్ని చూపే విధంగా పార్టీ శ్రేణులు పనిచేశాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములయ్యారు. గొప్ప మైలురాయిని సాధించిన పార్టీ శ్రేణులను లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభినందించారు.
40 రోజుల్లో రికార్డులు
ఒకే రోజులో అత్యధికంగా 19,405 బూత్‌లలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఒకే రోజులో ఏకంగా 28,397 మంది కార్యకర్తలు క్షేత్రస్థాయి పర్యటనల్లో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త సగటున రోజుకు 12 ఇళ్లను పలకరిస్తున్నారు. మొదటి వారం తర్వాత నుంచి ఈ వేగం ఎక్కడా తగ్గకుండా స్థిరంగా కొనసాగుతోంది. ఆగస్టు 8వ తేదీన ఒకే రోజు అత్యధికంగా 3,51,229 ఇళ్లను సందర్శించారు. అలాగే ఒకే గంటలో అత్యధికంగా 48,899 ఇళ్లను టీడీపీ కార్యకర్తలు సందర్శించారు.
ప్రతి ఇంటి సందర్శనకు డిజిటల్ ధ్రువీకరణ
పర్యటనల్లో ఎక్కడా ఎలాంటి తప్పులకు తావులేకుండా ప్రతి సందర్శనను మై టీడీపీ యాప్‌లో టీడీపీ శ్రేణులు తప్పనిసరిగా నమోదు చేస్తున్నారు. సందర్శించిన ఇళ్లలో 82 శాతం ఇళ్లను ఫొటో ఆధారంగా డిజిటల్ పద్ధతిలో ధ్రువీకరించారు. కచ్చితమైన లెక్కలు, పూర్తి పారదర్శకతతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా