రోడ్డుపైనే అక్రమ వసూళ్లు
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:08 AM
రవాణా శాఖలో అక్రమ వసూళ్లకు బ్రేకులు పడట్లేదు. చెక్ పోస్టులు, టోల్ ప్లాజాలు, రహదారులు పక్కన మామూళ్ల వసూళ్లు తగ్గడం లేదు. అన్నీ ఆన్‌లైన్ అని ప్రభుత్వం చెబుతున్నా ఎంవీఐల నుంచి హోంగార్డు వరకూ దందాలు ఆపడం లేదు. తరచుగా ఏసీబీ దాడుల్లో భారీగా అక్రమ సంపాదన పట్టుబడుతుండటం చర్చనీయాంశమైంది.
వాహనదారులను చెకింగ్ పేరుతో దోపిడీ
ఫిట్‌నెస్‌లో ఏటీఎస్‌ల చేతివాటం
డబ్బులిస్తే పాస్.. లేకుంటే ఫెయిల్
మంత్రి, కమిషనర్‌ది చెరోదారి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రవాణా శాఖలో అక్రమ వసూళ్లకు బ్రేకులు పడట్లేదు. చెక్ పోస్టులు, టోల్ ప్లాజాలు, రహదారులు పక్కన మామూళ్ల వసూళ్లు తగ్గడం లేదు. అన్నీ ఆన్‌లైన్ అని ప్రభుత్వం చెబుతున్నా ఎంవీఐల నుంచి హోంగార్డు వరకూ దందాలు ఆపడం లేదు. తరచుగా ఏసీబీ దాడుల్లో భారీగా అక్రమ సంపాదన పట్టుబడుతుండటం చర్చనీయాంశమైంది. రోడ్డుపైన బండి ఆపడం.. పత్రాలు చూపాలంటూ వేధించి డబ్బు వసూలు చేయడం బాగా ఎక్కువైంది. పోరుగు రాష్ట్రాల గూడ్స్ వాహనాలు, అధిక లోడుతో ఉన్న రవాణా బండ్లు రోడ్డుపైకి వచ్చాయంటే ఎంవీఐలకు నోట్ల వర్షమే. వీరి అవినీతికి బ్రేకులు వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రవాణా సేవల్ని ఆన్‌లైన్ చేసినా ఆర్టీఏ కార్యాలయ పరిసరాల్లో ఇప్పటికీ ఏజెంట్లు హవా కొనసాగిస్తూనే ఉన్నారు. ఫిట్‌నెస్ నుంచి ఎంవీఐలను తప్పించి ప్రైవేటు వ్యక్తులకు ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్(ఏటీఎస్) అప్పగిస్తే మరింత విచ్చలవిడి అయిపోయింది. ఎంవీఐ తనిఖీ చేసినప్పుడు కనీసం ఆ వాహన డ్రైవర్, యజమాని ముందే టెస్ట్ జరిగేది. రవాణా అధికారుల పర్యవేక్షణ లేకుండా నడుస్తోన్న ఏటీఎస్‌లలోకి వాహన డ్రైవర్ కాదు కదా యజమానిని కూడా అనుమతించట్లేదు. ఏజెంట్‌కు డబ్బులిస్తే ఫిట్‌నెస్‌లో పాస్, ఇవ్వకుంటే ఫెయిల్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ లక్ష్యానికి పంచర్లు పడుతున్నాయి.
చేతులు తడపాల్సిందే..
కోటిన్నరకు పైగా వాహనాలున్న ఏపీలో ఏటా రూ.7 వేల కోట్ల వరకూ రవాణా శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఇందులో ప్రధానంగా పన్నులు, ఫీజులు, జరిమానాలు, పర్మిట్ల ద్వారా భారీగా వస్తే.. వాహన రిజిస్ట్రేషన్ల నుంచి ఫిట్‌నెస్ వరకూ సేవల రూపంలోనూ ఆదాయం సమకూరుతోంది. వాహన రకం, వినియోగం, బరువు, సీటింగ్ సామర్థ్యం, ప్రయాణ పరిధి ఆధారంగా రవాణా శాఖకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్సులు ఆర్టీవో కార్యాలయం నుంచి అందే సేవలు పొందాలంటే చేతులు తడపాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉండేది. రవాణా కార్యాలయ సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై ప్రజల్ని పీడించే వారు. దీంతో వాహన రిజిస్ట్రేషన్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ వరకూ పలు సేవల్ని ప్రభుత్వం ఆన్‌లైన్ చేసి అవినీతికి బ్రేకులు వేసే ప్రయత్నం చేసింది. బండి కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేయిస్తోంది. వాహనాల గురించి తెలిసినోడికి అవినీతి దారులు తెలియవా అన్నట్లు అందులోనూ సర్వీస్ చార్జి పేరుతో అసలు ఫీజు కన్నా సేవా రుసుము ఎక్కువ వసూలు చేయించి ఆర్టీఏ సిబ్బంది వాటా తీసుకొంటున్నారు. ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేసినా ఏజెంట్‌ను సంప్రదించకుండా పని జరగడం లేదు.
చెకింగ్ అంటేనే కలెక్షన్!
ఎంవీఐలు వాహనాల తనిఖీ పేరుతో రోడ్డెక్కారంటేనే కలెక్షన్ల కోసమని వాణిజ్య వాహన యజమానులు వాపోతున్నారు. ఓవర్ లోడ్, పర్మిట్, ఫిట్‌నెస్, పన్ను బకాయి తదితర ఏదో ఒక కారణం చూపి దండుకొంటున్నారు. ‘కేసు రాస్తే భారీగా చెల్లించి రశీదు తీసుకో. వద్దంటే కొంత నగదు చెల్లించి వెళ్లిపో’ అంటూ ఎంవీఐకి సహాయకులుగా ఉండే హోంగార్డులే భయపెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఏసీబీకి తరచుగా ఫిర్యాదులొస్తున్నాయి. రవాణా శాఖ ఉన్నతాధికారులకు సైతం ఇటువంటి ఫిర్యాదులు రావడంతో కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఇటీవల ఒక మెమో జారీ చేశారు. ‘రవాణా వాహనాల పన్ను బకాయి ఉన్నా సరే.. సీజ్ చెయ్యొద్దు’ అని ఆదేశాలు జారీ చేశారంటే ఎంవీఐల బెదిరింపు దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
చెక్ పోస్టుల నుంచి రోడ్డు పక్కకు..
రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా చెక్ పోస్టులు అంటేనే నోట్ల వర్షం కురిపించే కేంద్రాలుగా ప్రసిద్ధి. అందుకే రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో టోల్ ప్లాజాలు, రహదారి పక్కన ఎంవీఐలు వాహనాల్ని ఆపి తనిఖీలు చేస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. ఎక్కడో ఒక చోట రేడియం స్టిక్కర్ సరిగా లేదంటూ జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిమానాలు భారీగా పెంచడంతో వాహన యజమానులు ఎంవీఐలను బతిమాలుకుని లంచం ఇచ్చి ముందుకు కదులుతున్నారు. పొరుగు రాష్ట్రాల సరుకు రవాణా వాహనాలకైతే మరింత వేధింపులు తప్పవు. ఓవర్ లోడ్, పర్మిట్ ఉల్లంఘనలు ఉంటే రవాణా సిబ్బందికి పండగే. నెల్లూరు జిల్లా కావలి వద్ద శనివారం రాత్రి ఒక ఎంవీఐ ఇలా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తనిఖీలకు వెళ్లిన ఏసీబీ అధికారులకు ఆయన కారు డిక్కీలో రూ.1.80 లక్షలు, సహాయకుల వద్ద రూ.68వేలు పట్టుబడింది. ఒక్క రాత్రిలో ఎంవీఐ ఈ స్థాయిలో అక్రమ వసూలు చేశాడంటే ఏ స్థాయిలో ఆర్టీఏ దందా నడుస్తోందో తెలుస్తోంది.
మంత్రి అలా.. కమిషనర్ ఇలా..
రవాణా శాఖలో మంత్రిది ఒక దారి అయితే కమిషనర్‌ది మరో దారి. ఇద్దరూ సమన్వయంతో సమీక్షించి ప్రజా ప్రయోజనకర నిర్ణయాలు తీసుకున్నది అరుదు. మంత్రి తన సొంత నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇస్తుంటే.. కమిషనర్ అవినీతి కట్టడిపైనే ధ్యాస పెట్టారు. ఇతర పనులపై ఆసక్తి చూపడం లేదని, ఫైళ్ల కదలికలోనూ వేగం లేదని అంటున్నారు. ఏడాదిన్నరగా ఆయన బదిలీ కోసం ఎదురు చూస్తున్నారని రవాణా శాఖ సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు.
ఫిట్‌నెస్‌లో ఏటీఎస్‌ల దోపిడీ..
వాహన ఫిట్నె్‌సలో ఎంవీఐలు, ఆర్టీవోలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్ల(ఏటీఎ్‌సల)ను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు సొంత స్థలంలో ఏర్పాటు చేసుకుంటే కొన్నేళ్ల పాటు మొత్తం ఫీజు వాళ్లే తీసుకుని ఒప్పంద గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎంవీఐలు, ఆర్టీవోలతో సంబంధం లేకుండా వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల దోపిడీ మరింత ఎక్కువైంది. ‘కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం. వసూలు చేసుకోకపోతే ఎలా?’ అని కొందరు ఏటీఎస్‌ల నిర్వాహకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. బండికి ఫిట్నెస్ లేకున్నా ఏజెంట్ ద్వారా వెళ్తే పాస్ చేస్తున్నారని వాహన యజమానులు చెబుతున్నారు. ఏటీఎస్‌లలో ఏమి జరుగుతోందంటూ కనీసం డీటీసీ స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణ చేయడం లేదు.
ఈ వార్తలను కూడా చదవండి
ధారకొండ ఘాట్ రోడ్డులో ప్రమాదం