అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి
ABN , Publish Date - Nov 19 , 2024 | 10:59 PM
మూడు రాష్ర్టాలను కలిపే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది.
- టెండర్ పూర్తి అయినా నత్తనడక పనులు
వడ్డేపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మూడు రాష్ర్టాలను కలిపే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణం సాగిస్తుంటాయి. కాగా రహదారిని వెడల్పు చేసినప్పటికీ ఇరువైపులా కల్వర్టులను నిర్మించకపోవడంతో పైపాడు, జూలకల్లు, వెంకటాపురం కల్వర్టుల వద్ద తరచూ ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు.
ఇరువైపులా ముళ్లపొదలు..
నియోజకవర్గంలోని అలంపూర్ చౌరస్తా నుంచి బలిగెర వరకు రెండు లైన్ల ప్రధాన రహదారి ముళ్లపొదలతో మూసుకుపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. అలాగే కల్వర్టుల వద్ద సూచిన బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలంపూర్ చౌరస్తా నుంచి అయిజ వరకు దాదాపు 40 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ డబుల్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. దీనికి తోడు కల్వర్టులు శిథిలావస్థకు చేరి ఇరుకుగా ఉన్నాయి. నియోజకవర్గంలో ముళ్లపొదలు తొలగించడానికి ప్యాచ్ వర్క్‌లో పనిచేయడానికి మొత్తం రూ.1.2 కోట్లు మంజూరయ్యాయి. పనులు చేపట్టేందుకు టెండర్లు పూర్తి అయినా పనలు నత్తనడకన సాగుతుండటం గమనార్హం. ఇప్పటికై సంబంధిత అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.