ఆగి ఉన్న బైక్‌ను ఢీకొన్న జిప్సీ వాహనం.. యువకుడి పరిస్థితి విషమం
ABN , Publish Date - Oct 11 , 2026 | 09:15 PM
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం వద్ద రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆగి ఉన్న పల్సర్ బైక్‌ను జిప్సీ వాహనం ఢీకొట్టడంతో కేతనకొండకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 11: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న పల్సర్ బైక్‌ను జిప్సీ వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న కేతనకొండ గ్రామానికి చెందిన సాలవ వెంకటేష్ (30) తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తుళ్లూరు గ్రామానికి చెందిన వారిదిగా గుర్తించిన జిప్సీ వాహనంలో ప్రమాద సమయంలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. జిప్సీలో ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారైనట్లు సమాచారం. యువకులు మద్యం సేవించి.. అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని.. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని.. పరారీలో ఉన్న ముగ్గురిని కూడా వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ క్రమంలో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం వల్ల అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News