Share News

ఆస్తిపై కన్నేసి ట్రాప్‌ చేశాడు

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:28 AM

గుంటూరుకు చెందిన బాలిక కిడ్నాప్‌ కేసులో నిందితుడు జానీ సైదా అలియాస్‌ రబ్బాని అలియాస్‌ పండును ఎట్టకేలకు పోలీసులు నగరానికి తీసుకువచ్చారు. శనివారం గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ వకుల్‌ జిందాల్‌, సిట్‌ ఇన్‌చార్జి, క్రైమ్‌ ఎస్పీ సుప్రజ తదితరులు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు.

ఆస్తిపై కన్నేసి ట్రాప్‌ చేశాడు

  • వీడిన గుంటూరు బాలిక కిడ్నాప్‌ మిస్టరీ

  • రెండేళ్లుగా నిందితుడు జానీ సైదాకు బాలికతో పరిచయం

  • తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటికి.. ఇంట్లోనే లైంగిక దాడి

  • బ్లాక్‌మెయిల్‌ చేసిన జానీ తల్లి, సోదరి..

  • నిందితుడి ప్రోద్బలంతో బంగారం, నగదు తీసుకెళ్లిన బాలిక.. కొంత విక్రయం..

  • బీర్లు తాగుతూ బాలికకు చిత్రహింసలు

  • ఇద్దరినీ గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులు

గుంటూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గుంటూరుకు చెందిన బాలిక కిడ్నాప్‌ కేసులో నిందితుడు జానీ సైదా అలియాస్‌ రబ్బాని అలియాస్‌ పండును ఎట్టకేలకు పోలీసులు నగరానికి తీసుకువచ్చారు. శనివారం గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ వకుల్‌ జిందాల్‌, సిట్‌ ఇన్‌చార్జి, క్రైమ్‌ ఎస్పీ సుప్రజ తదితరులు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన పదో తరగతి బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లి మూడు నెలలపాటు వివిధ ప్రాంతాలు తిరిగిన నిందితుడిని శుక్రవారం హరియాణాలోని కర్నాల్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరుకు చెందిన జానీ సైదా చిన్నప్పటి నుంచి జులాయి. ఇంటర్‌ వరకు చదివిన అతడు కొంత కాలం చిత్తు కాగితాలు, పాత సామాన్లు ఏరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌గా చేరాడు. గుట్కాలు, మద్యం విపరీతంగా తీసుకునేవాడు. రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా గుంటూరు రవీంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన బాలిక అతడికి పరిచయమైంది. ఒక్కతే కూతురు కావడం, ఆస్తులు ఉండడంతో జానీసైదా వాటిపై కన్నేసి బాలికను ట్రాప్‌ చేశాడు. గుంటూరు వచ్చి తరచూ బాలికను కలుస్తుండేవాడు. 2024లో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నేరుగా ఇంటికి వచ్చి ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆ ఇంటికి వెళ్లేవాడు. ఈ విషయం జానీ సైదా తల్లి, అక్కకు కూడా తెలుసు. వారిద్దరు కూడా బాలికను బ్లాక్‌మెయిల్‌ చేశారు. జూన్‌ 9న గుంటూరులో బాలికను కిడ్నాప్‌ చేసిన జానీ సైదా తొలుత నెల్లూరు వెళ్లి అక్కడి నుంచి తమిళనాడు, కేరళలో పలు ప్రాంతాలు, హైదరాబాద్‌, కర్ణాటకలో పలు ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ నుంచి జైపూర్‌, ఢిల్లీ వెళ్లారు. ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులతో పాటు ఇన్‌స్టా ఐడీలు మారుస్తూ తప్పించుకు తిరిగాడు.


ఏడు లక్షలకు బంగారం విక్రయం

బాలిక తనతో పాటు లక్ష రూపాయలకు పైగా నగదు, 200 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు తీసుకువెళ్లింది. నిందితుడు జానీ సైదా అందులో కొంత బంగారాన్ని హైదరాబాద్‌లో ఏడు లక్షలకు విక్రయించాడు. బాలిక రైల్వే స్టేషన్లో టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో బంగారు ఆభరణంతో పాటు 30 వేల నగదు పోగొట్టుకుంది. వివిధ ప్రాంతాలు తిరుగుతూ నిందితుడు విపరీతంగా బీర్లు తాగాడు. బాలికను కొట్టాడు.

బాలికపై వశీకరణ ప్రయోగం

బాలికను జానీ సైదా ట్రాప్‌ చేయడానికి వశీకరణ మందు వినియోగించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ సమీపంలోని తాండా నుంచి వశీకరణ మందు తీసుకువచ్చి బాలికకు తినిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. వశీకరణ మందు ఇచ్చిన వ్యక్తిని విచారించేందుకు పోలీసు బృందాన్ని అక్కడికి పంపామని, అతడు అందుబాటులో లేడని ఎస్పీ చెప్పారు. బాలిక అదృశ్యం కేసులో కిడ్నాప్‌, పోక్సో, అత్యాచారం తదితర సెక్షన్లు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నిందితుడికి సహకరించిన అతడి తల్లి, సోదరిని కూడా నిందితులుగా చేరుస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వారినీ అరెస్టు చేస్తామన్నారు. బాలికను హైకోర్టు ముందు హాజరు పరచనున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

గతంలోనూ యువతికి మోసం

యుక్త వయసు వచ్చిన పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఓ కన్నేసి ఉంచాలని క్రైమ్‌ ఎస్పీ కె.సుప్రజ సూచించారు. ఎప్పటికప్పుడు వారి కదలికలు గమనిస్తుండాలన్నారు. నిందితుడు జానీ సైదా గతంలోనూ ఓ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్‌ చేశాడని, ఆస్తులు లేకపోవడంతో వదిలేశాడన్నారు. జానీ సైదా కేవలం బాలిక ఆస్తిపై కన్నేసి ట్రాప్‌ చేశాడని చెప్పారు. నిందితుడి సూచన మేరకే బాలిక బంగారం, డబ్బు తీసుకువెళ్లిందన్నారు.


ఈ వార్తలను కూడా చదవండి

రెండుగా జడ్పీ

ఉపాధ్యాయుల సేవలు అమూల్యం

Updated Date - Sep 06 , 2026 | 05:40 AM